FbTelugu

అమాత్యులందు… ఈ మంత్రులు వేర‌యా!

ప‌దేళ్ల ప్ర‌తిప‌క్షంలో పోరాడి సాధించుకున్న అధికారం. 175 అసెంబ్లీ సీట్ల‌లో వైసీపీ 151, టీడీపీ 23, జ‌న‌సేన 01 సాధించాయి. ఇదంతా టీడీపీ ఐదేళ్ల‌పాల‌న‌కు వ్య‌తిరేక‌త అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

టీడీపీ బ‌ల‌హీన‌త‌.. వైసీపీ బ‌లంగా మ‌ల‌చుకుంది. సామాజిక స‌మీక‌ర‌ణం కోసం అధికారం చేప‌ట్ట‌గానే ముగ్గురు డిప్యూటీ సీఎంలు.. మూడు కులాల‌కు ఇచ్చేసింది. మంత్రివ‌ర్గంలోనూ అంద‌రినీ ఆక‌ట్టుకునేలా చోటిచ్చారు. అయితే.. రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధి కాలమంటూ ష‌ర‌తు విధించారు.

పైగా ఏడాది స‌మ‌యంలో అమాత్యులు ఎవ‌రైతే మంచి గుర్తింపు తెచ్చుకుంటారో వారిని మాత్ర‌మే మంత్రులుగా కొన‌సాగిస్తానంటూ ఆనాడే తేల్చిచెప్పారు. జ‌గ‌న్ దృష్టిలో ప‌డేందుకు.. ఎమ్మెల్యేలు కూడా బాగానే దృష్టిసారించారు. నియోజ‌క‌వ‌ర్గం వారీగా కూడా జ‌గ‌న్ త‌న సొంత మీడియా ద్వారా స‌మాచారం సేక‌రిస్తున్నారు. ప్ర‌తికూల‌త‌, వ్య‌తిరేక‌త‌ల‌ను తెలుసుకుంటుంటూనే ఉన్నార‌ట‌.

ఇప్పుడెందుకీ ఇదంతా అంటే… మే 31 నాటికి ఏడాది వైసీపీ పాల‌న పూర్తికాబోతుంది. ఎమ్మెల్యేల్లో కొంద‌రు ఆశ‌వ‌హులు బోలెడ‌న్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. కేవలం న‌లుగురైదుగురు మంత్రులు మాత్ర‌మే త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌స్తున్నారు. వారిలో క‌న్న‌బాబు, అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని, పేర్నినాని , ఆళ్ల‌నాని ప్ర‌తిచోట త‌మ స్వ‌రాన్ని వినిపిస్తున్నారు. క‌రోనా కాలంలో పేర్నినాని, ఆళ్ల‌నాని ఇద్ద‌రూ వేగంగా స్పందించారు. మ‌రో నాయ‌కుడి దృష్టిలో శ‌భాష్ అనిపించుకున్నారు.

మండ‌లి ర‌ద్దుతో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ కాస్త సైలెంట్ అయ్యారు. ఎలాగూ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌టంతో మంత్రులుగా కేవ‌లం నామ‌మాత్రంగా మిగిలారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే.. డ‌జ‌ను మంది ఎమ్మెల్యేల వ‌ర‌కూ అమాత్యా అనిపిలిపించుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రి ముచ్చ‌ట తీరుతుందో చూడాలి.

You might also like