FbTelugu

కుప్పంలో చంద్రబాబు క్లీన్ బౌల్డ్: మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో ఘోర పరాభవం కట్టబెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఇవాళ తిరుపతిలో మీడియా సమావేశంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పకూలిందని అన్నారు. కుప్పంలో మళ్ళీ పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? మరో నియోజకవర్గం చూసుకుంటావా..? అసలు రాజకీయాల్లో వుండగలవా? అని ఆయన నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ పనితీరుకు కుప్పం ప్రజలు పట్టం కట్టారన్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో 84.26 శాతం వైసిపి విజయం సాధించిందన్నారు. కుప్పంలో 89 సర్పంచ్ స్థానాల్లో 75 వైసిపి గెలిచిందన్నారు. టిడిపి గెలిచిన 14 స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ కేవలం 1872 ఓట్లు అని రామచంద్రారెడ్డి వివరించారు.

రాష్ట్రంలో మూడు దశల్లో 80 శాతంకు పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని అన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని, ఇప్పటికైనా తన ఓటమిని అంగీకరించాలని అన్నారు. ఓటమితో తన పదవిని వదులుకుంటాడా? రాజకీయాల నుంచి పలాయనం చిత్తగిస్తాడా? ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో టిడిపికి నూకలు చెల్లాయని చంద్రబాబు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని తన వయస్సుకు తగినట్లుగా మాట్లాడాలని రామచంద్రారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.