FbTelugu

మళ్లీ కరోనా ఆసుపత్రులు సిద్ధం: మంత్రి ఈటల

హైదరాబాద్: గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా అసుపత్రులుగా మార్చాలని నిర్ణయించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 33 జిల్లా కేంద్రాలలోని హాస్పిటల్స్ లో కరోనా వార్డ్స్ ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిచాలని నిర్ణయించామన్నారు.
కరోనా కేసులు, నియంత్రణ, వైద్య సహాయంపై మంత్రి రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సర కాలంలో కరోనా అనేక అనుభవాలు అందించిందన్నారు. మొదట్లో పేషంట్ దగ్గరికి పోవాలంటేనే భయం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు మాస్క్ పెట్టుకొని పేషంట్ల దగ్గరికి డాక్టర్ లు, సిబ్బంది వెళ్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, లక్షణాలు ఉన్నా పరీక్ష చేసుకోకుండా ఆలస్యం చేస్తారో, నిర్ధారణ అయిన తరువాత కూడా చికిత్సి తీసుకోని వారికి ఇబ్బంది అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు అని మంత్రి రాజేందర్ కోరారు.
కరోనా చికిత్స లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆక్సిజన్ అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 22 హాస్పిటల్స్ లో శాశ్వతంగా ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ లను ఏర్పాటు చేశారు. వెంటిలేటర్ మీద ఉన్న పేషంట్ కి ఆక్సిజన్ కొరతకి సంబందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఆక్సిజన్ సిలెండర్లను అందుబాటులో ఉంచామని మంత్రి రాజేందర్ తెలియజేశారు.
అన్ని జిల్లా కేంద్రాలలో మునుపటిలా ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. పాజిటివ్ గా నిర్ధారణ అయి ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ఐసోలేషన్ సెంటర్ల లో ఉంచేదుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయా కేంద్రాలలో 24 గంటలు డాక్టర్ లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. అతి త్వరలో వీటిని సిద్దం చేస్తామని మంత్రి తెలియజేశారు.
హైదరాబాద్ లో నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా టిబ్బి హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్ సెంటర్ లుగా మార్చాలని నిర్ణయించామన్నారు.

మరో వారం రోజుల్లో ఇవన్నీ సిద్దం చేయాలని అధికారులని ఆదేశించారు. హోం క్వారంటైన్ లో ఉండేవారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎస్ఆర్.నగర్ లో కాల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో పని చేయనుందన్నారు. పేషంట్ల భయాన్ని సొమ్ము చేసుకోవద్దు అని మంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్ వారిని మంత్రి రాజేందర్ కోరారు.
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు రాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ లు చేస్తున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్ కి వెంటనే మొబైల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ లు పంపించే విధంగా నూతన ఆప్ రూపకల్పన జరిగిందన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.