FbTelugu

లాక్ డౌన్ పెట్టం: మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ ను అంచనా వేయడంతో కేంద్ర ప్రభుత్వం ఘరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఇవాళ రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, సెకండ్ వేవ్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, వ్యాక్సిన్లు, ఇంజక్షన్ల సరఫరాలో కేంద్రానికి ముందు చూపు లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలపై తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

మే 1వ తేదీ నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. రేపట్నుంచి 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ హబ్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నట్లు రాజేందర్ తెలిపారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు మూడు, నాలుగు రోజులకొకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని, అన్ని జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు 600 టన్నుల ఆక్సిజన్ కోరితే కేంద్రం 306 టన్నులు మాత్రమే కేటాయించిందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. రూ.3వేలు విలువ చేసే రెమిడెసివిర్ ఇంజక్షన్ మార్కెట్ లో రూ.30వేలకు విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.