FbTelugu

అవే కొంప ముంచుతున్నాయా..?

దేశంలో కరోనా తీవ్రతకు వలసలే ప్రధాన కారణాలవుతున్నాయా..? ఇండియాలో కేసుల విజృంభణకు అవే కీలకంగా మారాయా..? వారినుంచే దేశానికి అధిక ముప్పు పొంచి ఉందా..? ఒక్కసారిగా దేశంలో కరోనా బాధితులు, మృతులు పెరగడానికి కారణం ఏమిటి..? ఇవీ ఇప్పుడు ఇండియన్లను వేధిస్తున్న ప్రధాన ప్రశ్నలు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో అన్నిరంగాలు మూతపడ్డాయి. రవాణారంగం కూడా పూర్తిస్థాయిలో ఆగిపోయింది. దీంతో కరోనా వ్యాప్తికి కూడా కొంతవరకు బ్రేకులు పడ్డాయి. దీంతో సర్కార్లు లాక్‌డౌన్‌లు సడలించాయి. మద్యం దుకాణాలు కూడా తెరిచారు. కొన్ని రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ కూడా నడుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే లాక్‌డౌన్‌ ఎత్తేసినట్టుగానే వాతావరణం ఉంది. దీంతో జనం భారీగా రోడ్డెక్కుతున్నారు. దీంతో ఇన్నాళ్లపాటు అదుపులో ఉన్న కరోనా వైరస్‌ మరింత స్పీడుగా వ్యాప్తి చెందుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

తెలంగాణలో తగ్గినట్టే కనిపించిన వైరస్‌ ఇప్పుడు వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిద్వారా మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. వలసదారులు రాకముందు కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఈ కేసులు నమోదయ్యేవి. జిల్లాల్లో ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదు. కానీ, ఇప్పుడు జిల్లాలకు కూడా మళ్లీ వ్యాపిస్తున్నాయి. ఇది రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 71మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 38మంది ఉండగా, మిగతా వారంతా వివిధ జిల్లాలకు చెందిన వారే. దీంతో మళ్లీ జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే దేశంలో కూడా ఈ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చేస్తున్న హెచ్చరికలు కూడా జనాన్ని నిద్ర పోనివ్వడం లేదు.

జూన్‌లో ఈ వైరస్‌ బారిన పడేవారి సంఖ్య 15 లక్షల దాకా ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే, గత వారం రోజుల్లోనే 45వేల కేసులు నమోదు కావడాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తెలంగాణలో అందరికీ పరీక్షలు అవసరం లేదని సర్కారు చెబుతోంది. మరణించిన వారికి కూడా పరీక్షలు చేయలేదు. దీనివల్లే తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని విపక్షాలతో పాటు జనం గగ్గోలు పెడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా సర్కారు వినడం లేదు. దీంతో కరోనాపై సర్కారు చేతులెత్తేసిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

You might also like