FbTelugu

దేవుడు వరమిచ్చినా..!

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదు అన్నట్టుగా ఉంది పేదల పరిస్థితి. కరోనా ప్రభావంతో సర్కారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో అన్నిరంగాలు మూతపడ్డాయి. పేదల బతుకులు లాక్‌ అయ్యాయి.

ఉపాధి మార్గం లేక.. తినడానికి తిండిలేక అనేక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో కేంద్రం ఓ ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ రుణాలకు ఎలాంటి షరతులూ విధించవద్దని నిర్ణయించింది. దీంతో చాలామంది రుణాల కోసం బ్యాంకుల వద్ద బారులు కట్టారు. తీరా చూస్తే బ్యాంకు అధికారులు మాత్రం అనేక షరతులు పెట్టి రుణాలు ఇవ్వకుండా ఖాళీ చేతులతో ఇంటికి పంపుతున్నారు. వాస్తవానికి బ్యాంకులో అప్పటికే బాకీ ఉన్నా కొత్త రుణాలు ఇవ్వాలని, ష్యూరిటీ కూడా అవసరం లేదని కేంద్రం చెప్పింది.

కానీ, బ్యాంకర్లు మాత్రం దరఖాస్తు తీసుకొని సిబిల్‌ స్కోరు చూసి ఫోన్‌ చేస్తామని చెప్పి ఇంటికి పంపుతున్నారు. తీరా సాయంత్రానికి ఫోన్‌ చేసి మీకు సిబిల్‌ స్కోరు తక్కువగా ఉందని.. మీకు రుణం ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. కొంతమందికి ష్యూరిటీ లేదన్న సాకుతో రుణాలు ఇవ్వడం లేదు. అసలు సిబిల్‌ స్కోరు అంటేనే ఏమిటో తెలియక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అనేక రకాల కారణాలతో కొర్రీలు పెడుతూ బ్యాంకర్లు రుణాలివ్వడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం రుణాలిస్తామన్నా బ్యాంకర్లు సహకరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లు తమ కష్టాలను గుర్తించి ఎలాంటి షరతులు లేకుండా రుణాలివ్వాలని వారు వేడుకుంటున్నారు.

You might also like