FbTelugu

అమ్మ రేవంతూ…!

టీపీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పదవి కోసం అనేకమంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒక దశలో రేవంత్‌రెడ్డికి పదవి ఖాయమైందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆయనకు పదవి ఇవ్వడం ఇష్టంలేని వారు తమ అసహనాన్ని వెలిబుచ్చారు కూడా. వీహెచ్‌లాంటి సీనియర్‌ నేత అయితే రేవంత్‌రెడ్డికి పదవి ఇస్తే తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిణామాల మధ్య పీసీసీ అధ్యక్షుడెవరో తేల్చుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్టానానికి బాగానే సమయం పట్టింది.

ఇప్పటికీ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో పీసీసీ పీఠం తనకు అవసరం లేదని.. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తే చాలని రేవంత్‌ తేల్చి చెప్పారట. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌కు రావడం లేదని తేలిపోయినట్టయింది. ఈ స్థానంలో వివాదాస్పదుడు, సీనియర్‌ అయిన జీవన్‌రెడ్డిని ఎంపిక చేసే పనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి రేవంత్‌రెడ్డికి కూడా పీసీసీ అధ్యక్ష పదవి కంటే ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి అంటేనే ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడైతే నేరుగా జనాల్లోకి పోవడం కంటే పార్టీ నాయకులతో సమావేశాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనేది రేవంత్‌ అభిప్రాయం. సహజంగా కాంగ్రెస్‌లో ఎప్పుడూ వర్గ సమీకరణాలు, వాటి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటాయి. దీంతో పీసీసీ అధ్యక్షుడికి ఇదే కత్తిమీద సాములా ఉంటుంది. కాబట్టి ఈ పంచాయితీ అంతా ఇష్టం లేని రేవంత్‌ ప్రచార కమిటీపై కన్నేశారట. వాస్తవానికి ఆయన కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఆయన ఇదే పదవిని అడిగారట. కానీ, పార్టీ ఆయనకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించింది. తాను నిత్యం జనం మధ్య ఉండి తన వాగ్ధాటితో ప్రజలను కాంగ్రెస్‌వైపు తిప్పుకోవడమే ఇష్టంగా భావించిన రేవంత్‌ ఇప్పుడు పట్టుబట్టి ప్రచార కమిటీ చైర్మన్‌ పదవిని సాధించబోతున్నారని కాంగ్రెస్‌ నాయకులే చెబుతున్నారు. ఈ నిర్ణయం రేవంత్‌కు రెండు విధాలుగా కలసి వస్తుందని భావిస్తున్నారు.

పీసీసీ పీఠంపై పోటీ పెరగడం.. సీనియర్లు రేవంత్‌పై గుర్రుగా ఉండడంతో పార్టీకి నష్టం జరగకుండా ముందస్తుగా తానే పీసీసీ పదవి నుంచి తప్పుకున్నాడన్న పేరు అధిష్టానం వద్ద తెచ్చుకున్నట్టవుతుంది. ఇక, రెండోది ప్రచార కమిటీ చైర్మన్‌ పేరుతో రాష్ట్రమంతా పర్యటించి జనాల్లో తన పలుకుబడిని పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది. ప్రజల్లో మంచి క్రేజ్‌ తీసుకువస్తే అధిష్టానం దృష్టిలో తనకు తిరుగు ఉండదని రేవంత్‌ భావిస్తున్నట్టు ఉంది. జనం అంతా కాంగ్రెస్‌కు మద్దతునిస్తే అప్పుడు పార్టీని బలోపేతం చేసిన క్రెడిట్‌ రేవంత్‌కే దక్కుతుంది. అలాంటప్పుడు సీఎం అభ్యర్థిగా కూడా ముందు వరుసలో ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకున్నాకే రేవంత్‌ పీసీసీ బరినుంచి తప్పుకొని తనకిష్టమైన పదవిని కొట్టేయబోతున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.