FbTelugu

 అక్కా చెల్లెళ్ల మధ్య..

అక్కా చెల్లెళ్ల మధ్య వారసత్వ పోరు రాజుకుంది. ఇప్పుడు మాన్సాస్‌ వారసత్వపోరు మరో మలుపు తిరిగింది. సంచయిత వారసురాలు కాదంటూ రంగంలోకి రెండో భార్య కూతురు దిగడంతో రాచరికపు పోరు రాజుకొంటుంది. దీంతో ఏపీలోని విజయనగరం కోట కోసం సమరం ఆసక్తిని రేపుతోంది. మొన్నటి వరకు మాన్సాస్‌ ట్రస్ట్‌కు తానే వారసురాలినని కత్తులు దూసిన యువరాణి కోటను కైవసం చేసున్నారు. అయితే అసలు వారసురాలిని తానేనంటూ ఇప్పుడు రాజుగారి రెండో భార్య కూతురు ఆకస్మికంగా రంగ ప్రవేశం చేసింది.

మొన్నటి వరకు బాబాయి–అమ్మాయి యుద్ధంగా సాగిన సమరం, ఇప్పుడు అక్కాచెల్లెళ్ల రణంగా మారింది. ఇంతకీ సంచయిత వారసురాలు కాదంటూ తెరపైకి వచ్చిన ఊర్మిళా గజపతి వెనక ఎవరైనా ఉన్నారా? నిజంగా రాచరికం కోసమేనా? లేదంటే వీరి నడుమ సాగుతున్నది రాజకీయ రణమా? రాజకోట రహస్యం చెబుతున్నదేంటి అనే చర్చ కొనసాగుతోంది. విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్పాస్‌ ట్రస్టు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్టు ఛైర్మన్‌ నియామకంలో జరిగిన పరిణామాలు మరువకముందే ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతి, పూసపాటి వంశానికి తానే అసలైన వారసురాలునంటూ విశాఖపట్నంలో ప్రకటన చేయ డంతో మళ్ళీ రాజుగారి ఇంటిపోరు చర్చకొచ్చింది. పూసపాటి సంచయిత గజపతిరాజు ఆనందగజపతి రాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె. ఊర్మిళ ఆనంద గజపతి రాజు రెండో భార్య సుధ కూతురు. ఇద్దరూ ఆనందగజపతిరాజు కూతుళ్లే.

వరుసకు అక్కా చెల్లెళ్లే. ఇప్పుడు వీరి మధ్య వారసత్వ యుద్ధం మొదలైంది. ఇప్పటికే రాజకీయ సంచలనంగా మారి కోర్టు మెట్లెక్కిన మాన్సాస్‌ వారసత్వ యుద్ధం తాజాగా అక్కాచెల్లెళ్ల మధ్య రాజుకుంది. నిన్నటి వరకు తాను పూసపాటి వారసురాలినంటూ తెరపైకి వచ్చిన సంచయిత మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ పీఠంతోపాటు సింహాచలం దేవస్థానం ట్రస్టు చైర్మన్‌ బాధ్యతలను స్వీకరించారు. తానే ఆనంద గజపతిరాజు నిజమైన వారసురాలినని ప్రకటించుకున్నారు. తాజాగా రెండవ భార్య సుధా గజపతి కుమార్తె ఊర్మిళా గజపతి తానే సిసలైన వారసురాలునంటూ ప్రకటించడం సంచలనం రేపింది. తన తండ్రి పూసపాటి ఆనందగజపతి రాజుగారు ఆనాడే వారసులేవరో ప్రకటించారని, ఆయన ఆస్తులను పంచుకుని తనతో సంబంధం లేదని వెళ్లిపోయిన వాళ్ళు నేడు వారసు రాలునంటూ రావడం అన్యాయంగా ఉందని ఊర్మిళ వ్యాఖ్యానించారు. చివరి వరకు తమ తండ్రి ఆనంద గజపతికి తోడుగా ఉన్న తామే అసలైన వారసులమని ఊర్మిళ శపథం చేస్తుండటంతో రాచరిక రణం కొత్త మలుపు తిరిగింది.

వారసత్వ పోరులో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఊర్మిళ చట్ట ప్రకారం వారసులం తామేనన్న లా పాయింట్‌ను తెరపైకి తెస్తున్నారు. వారసురాలిగా చెప్పుకోవడానికి తగిన ఆధారాలు సంచయిత దగ్గర ఏమీ లేవంటున్నారు. తన తండ్రి వీలునామాలో అన్ని రాశారని, సంచైత పేరు ఎక్కడా లేదని ఊర్మిళ గజపతి చెబుతున్నారు. సంచయిత ఎన్ని చెప్పినా న్యాయ స్థానంలో నిలబడదంటున్నారు. తాము సంచయితపై న్యాయపోరాటం చేస్తానని ఊర్మిళ సవాల్‌ చేస్తున్నారు. 1991లోనే ఆనందగజపతిరాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని, ఆనంద గజపతిరాజు బతికున్న సమయంలో కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది రెండో భార్య సుధ వాదన. ఆనంద గజపతిరాజును మానసికంగా వేధించారంటూ నాటి విషయాలన్నీ ఆమె వెల్లడిస్తున్నారు. ఎక్కడికో వెళ్లిపోయిన కుటుంబం ఇప్పుడొచ్చి వారసులం తామేనంటూ ప్రకటించుకోవడం అన్యాయమనటంతో రాజుల కోటలో యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.

అయితే ఆనంద్‌ గజపతిరాజు, ఉమా గజపతి చట్టపరంగా విడాకులు తీసుకున్నా వారిద్దరి సంతానమైన సంచయిత గజపతిరాజుకు పూసపాటి వంశీయుల వారసత్వం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. న్యాయ విద్య చదివిన సంచయిత గజపతి వారసత్వం విషయంలో చట్టపరమైన అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి అదను కోసం ఇప్పటి వరకు ఎదురు చూశారని కొందరంటున్నారు. ఇప్పటికే మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని వేల ఎకరాల భూములను కాజేసేందుకు అధికార పార్టీ వైసీపీ సంచయితను ముందుపెట్టి రాజకీయం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆనంద గజపతిరాజు తమ్ముడు, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు సైతం కోర్టు మెట్లెక్కారు. మాన్సాస్‌ ట్రస్టు వారసత్వ పోరు కొనసా గుతున్న సమయంలో సడెన్‌గా సంచయిత చెల్లెలు ఊర్మిళ తెరపైకి రావడంతో పూసపాటియుల సమరం మరో మలుపు తిరిగినట్టయ్యింది. ఈ వారసత్వ యుద్ధంలో నిజమైన వారసులుగా నిరూపించుకుని రాజుగారి కోటను దక్కించుకునేదేవరో వేచిచూడాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.