FbTelugu

కేసీఆర్, మోదీ ఒక్కటయ్యారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రం దుర్మార్గపు చర్యలను అడ్డుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ కి తలూపుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు అని అన్నారు.
కేసీఆర్, మోదీ ఒక్కటైనందున మన సమస్యల మీద మనమే పోరాటం చేద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్.. తాను కూడా రైతును అని చెబుతుంటారు కాని ఎందుకు అండగా నిలవడం లేదని ఆయన నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుబంధు పథకం డబ్బులు బ్యాంకులు ఇవ్వడం లేదన్నారు.

పసల్ బీమా కు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల రైతు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్గు తాండలో 1800 ఎకరాల అసైన్డ్ భూమి ని స్థానిక లంబడీలు సాగు చేస్తున్నా పట్టాలు ఇవ్వడం లేదని అన్నారు. ఈ భూమి ని కొందరు అక్రమంగా ఆక్రమించారని, తిరిగి ఇవ్వకపోతే వారి భరతం పడతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ పేరిట 20 వేల ఎకరాలను ప్రభుత్వం గుంజుకుందన్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని క్రిమినల్ కేసులు పెట్టి లాక్కుంటున్నదన్నారు. టీఎస్ఐఐసీ అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల వద్ద నుంచి రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల ధర మధ్య తీసుకొని ప్రైవేట్ కంపెనీల కు రూ.1.25 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ నష్టపోయిన రైతులకు గజ్వేల్ లోని వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ను ఎకరాకు రూ.25 లక్షల చొప్పున ఇస్తావా అని ప్రశ్నించారు. ఈ అంశాలను సీతక్క అసెంబ్లీ వేదిక గా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతు బీమా గతంలో ప్రభుత్వమే అమలు చేసిందని, ప్రభుత్వం కాకుండా దానిని బీమా కంపెనీలకు కట్టబెట్టడమే పెద్ద కుంభకోణమన్నారు. ప్రభుత్వం బీమా కంపెనీలకు ఎంత చెల్లించింది… తిరిగి రైతులకు ఎంత చెల్లిస్తున్నారో లెక్కలు తీయాలన్నారు. మాజీ సీఎం వైఎస్.రాజశేఖర రెడ్డి వ్యక్తిగత అనుచరుడు సూరీడు నాకు చాలా కాలంగా మిత్రుడు.. నేను యాత్ర చేస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉండవచ్చన్నారు. రాయలసీమ బిడ్డ అయిన సూరీడు నాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే మూడు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ జై జవాన్, జై కిసాన్ నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్ దృష్ట్యా ఇంటికొకరు చొప్పున బయటకు రావాలన్నారు. తెలంగాణ లో గులాబీ చీడ పురుగుల ను వదిలించడం కోసం పోరాటం చేయాలన్నారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు పదిరోజుల పాటు ప్రజల్లో వివిధ కార్యక్రమాలు చేశామన్నారు. అచ్చంపేట లో నిర్వహించిన దీక్ష.. పాదయాత్ర గా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో వ్యవసాయ శాఖ ఉందని, కేంద్ర వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చన్నారు. బహుళజాతి కంపెనీలకు నష్టం వస్తే.. 1.25 లక్షల కోట్లు కేంద్రం భరించిందని ఆయన ఆరోపించారు. లాభసాటి ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పరం చేస్తోందని, ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్ర తప్పుడు విధానాలతో అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తోందని ఆరోపించారు. రైతుల చేతిలో ఉన్న అన్ని హక్కులను బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతోందని రేవంత్ విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.