FbTelugu

శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆరంభం

కర్నూలు: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం 9.45 గంటలకు స్వామివారి అర్చకులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది విద్యుద్దీపాలంకరణలతో అలంకరించారు. శివనామస్మరణతో భక్తులు శ్రీగిరుల వెంట పాదయాత్రగా తరలి వస్తున్నారు. 14న మహాశివరాత్రి పర్వదినం రోజున తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని, ఈ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కాలినడకన వచ్చే భక్తులను గుర్తించి వారికి ప్రత్యేక కంకణాలను ఇస్తున్నట్లు చెప్పారు.

నేటి ఉత్సవాలు…

శివ సంకల్పం, గణపతిపూజ, చండీశ్వర పూజ, కంకణపూజ, దీక్షా కంకణధారణ, రుత్విగ్వరుణం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటలకు శైవ పుణ్యాహం, అఖండ స్థాపన, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, పంచావరణార్చన, కలశార్చన, వాస్తుపూజ, వాస్తు హోమం, జపానుష్ఠాలు, పారాయణం, సాయంత్రం 5గంటలకు సాయంకాలార్చన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, రాత్రి 7 గంటలకు చండీశ్వర పూజ, భేరీపూజ, భేరీతాడన, త్రిశూల పూజలతో పాటు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ పూజ చేపట్టనున్నారు. అలాగే ధ్వజపటావిష్కరణ, బలిహరణ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.