FbTelugu

ప్ర‌యివేటు వ‌ర్సిటీల‌తో న‌ష్ట‌మా? లాభ‌మా?

ప్ర‌యివేటు వ‌ర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. మ‌రి ఈ యూనివ‌ర్సిటీలతో విద్యార్థుల‌కు లాభ‌మా.. న‌ష్ట‌మా అన్న చ‌ర్చ మొద‌లైంది.

తెలంగాణ రాక‌మునుపు కేసీఆర్ ఒక విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించేవార‌. తెలంగాణ‌లోని ప్ర‌తిఒక్క‌రికి కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం త‌క్కువేన‌ని చెప్పాలి.

ఓట్ల వేట‌లో రైతులు, స‌బ్బండ‌వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే ప‌నిగా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు గానీ విద్యారంగానికి పెద్దగా ఒన‌గూరిందేమీ లేదు.
ఈ త‌రుణంలో ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల‌కు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఒక్కసారిగా విద్యారంగంపై తెలంగాణ‌లో చ‌ర్చ మొదలైంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఏర్పాటైన యూనివ‌ర్సిటీలేవీ కొత్త‌వి కావు. ఇప్ప‌టికే అవి క‌ళాశాల‌లుగా ఉన్నాయి. ద‌శాబ్ధ‌కాలంగా క‌ళాశాల‌ల‌ను న‌డుపుతున్నారు.

క‌ళాశాల‌ల‌నే స్థాయి పెంచుతున్నార‌న్న‌మాట‌. క‌ళాశాల ఏర్పాటుకు, యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు ఎంతో తేడా ఉంది. క‌ళాశాల అనేది ఒక యూనివ‌ర్సిటీ అనుబంధంగా ప‌నిచేస్తుంది. అదే యూనివ‌ర్సిటీ వ‌స్తే స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల విష‌యంలో ప్ర‌మాణాలు ఎంత‌వ‌ర‌కు నిర్వ‌హిస్తార‌న్న దానిపైనే విద్యార్థుల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డింది. ప్ర‌యివేటు రంగంలో తెలుగు రాష్ట్రాల్లో యూనివ‌ర్సిటీలు త‌క్క‌వేన‌ని చెప్పాలి. పైగా రాష్ట్ర ప‌రిధిలో ఉండ‌టానికి ప్ర‌ముఖ క‌ళాశాల‌లేవీ ఇష్ట‌ప‌డ‌వు.

రాష్ట్రం ఆజ‌మాయిషీ ఉంటే కాలానుగుణంగా కోర్సుల్లో మార్పులు తీసుకురాలేమ‌ని భావిస్తుంటారు. అందుకే ఎక్కువ‌గా క‌ళాశాల‌లు డీమ్డ్ విశ్వ‌విద్యాల‌య హోదా కోసం ప్ర‌య‌త్నిస్తుంటాయి. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌యివేటు వ‌ర్సిటీలకు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంతో చాలావ‌ర‌కు క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. చివ‌రికి 9 క‌ళాశాల‌ల‌కు యూనివ‌ర్సిటీ హోదా ఇవ్వ‌వ‌చ్చ‌ని అధికారులు నిర్ణ‌యించారు. కానీ చివ‌రికి 5 క‌ళాశాల‌ల‌కే యూనివ‌ర్సిటీ హోదా క‌ల్పించారు. అంతేకాదు ఇప్పుడు ఆ క‌ళాశాల‌ల్లో యూనివ‌ర్సిటీకి త‌గ్గ‌ట్టుగా ప్ర‌మాణాలు పెంచుకోవాలి.

భ‌వ‌నాలు పెంచుకోవాలి. ల్యాబ్ సౌక‌ర్యాలు రావాలి. ఇవ‌న్నీ ఏర్పాటైతేనే పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య అందుతుంది. కొత్త యూనివ‌ర్సిటీల‌న్నీ దాదాపు టెక్నిక‌ల్ విభాగానికి సంబంధించిన‌వే. ఇవ‌న్నీ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి. ఇప్పుడు ఇవ‌న్నీ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెట్టే వీలుంది. అంతేనా ఈ యూనివ‌ర్సిటీల‌తో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌పై క‌చ్చితంగా ప్ర‌భావం ప‌డుతుంది. టెక్నిక‌ల్ కోర్సులు అందిస్తున్న జె.ఎన్‌.టి.యూ వంటి విశ్వ‌విద్యాల‌యాలు ఇక మీద‌ట గ‌ట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవే కాదు కొత్త‌గా ఏర్పాటైన యూనివ‌ర్సిటీలు డిగ్రీ కోర్సులు కూడా ప్ర‌వేశ‌పెట్టేందుకు వీలుంది. దీన్ని బేస్ చేసుకుంటే వందేళ్ల చ‌రిత్ర ఉన్న ఉస్మానియా వంటి యూనివ‌ర్సిటీల మ‌నుగ‌డ‌పైన ప్ర‌మాదం ప‌డుతుంది. ఎందుకంటే ప్ర‌భుత్వ వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్ల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌డం లేదు. ఒక‌ప‌క్క ప్ర‌భుత్వ వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్ పోస్టులు ఖాళీ అవుతుంటే.. ఇంకోప‌క్క ప్ర‌యివేటు వ‌ర్సిటీలు వ‌స్తే ఆ ప్ర‌భావం క‌చ్చితంగా ప్ర‌భుత్వం వ‌ర్సిటీల‌పై ఉంటుంది. ఒక ప్ర‌యివేటు వ‌ర్సిటీల ఫీజులు వారి ఇష్టం అన్న‌ట్లుగా ఉంటుంది. దీనివ‌ల్ల పేద విద్యార్థుల‌కు ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల్లో సీటు ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మే అవుతుంద‌నడంలో సందేహం లేదు.
ముగ్గురు నేత‌ల‌కు జాక్‌పాట్‌
ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల‌తో విద్యార్థుల‌కు, విద్యా వ్య‌వ‌స్థ‌కు లాభ‌మా… న‌ష్ట‌మా … అన్న విష‌యాలు ప‌క్క‌న పెడితే ముగ్గురు నేత‌ల‌కు ఈ విష‌యంలో జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే! ఎందుకంటే తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన 5 ప్ర‌యివేటు విశ్వ‌విద్యాల‌యాల్లో మూడు క‌ళాశాల‌ల గులాబీ నేత‌లవే ఉన్నాయి. మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ స్వ‌యంగా కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిది. రైతుబంధు రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి చెందిన అనురాగ్ క‌ళాశాల‌కు యూనివ‌ర్సిటీ హోదా ద‌క్కింది. వ‌రంగ‌ల్‌కు చెందిన మ‌రో నేత వ‌ర‌దారెడ్డికి చెందిన ఎస్‌.ఆర్ యూనివ‌ర్సిటీకి అనుమ‌తి ద‌క్కింది. మ‌రో రెండు బ‌డా కంపెనీల‌కు సంబ‌ధించిన‌వి ఉన్నాయి.

You might also like