FbTelugu

దీర్ఘకాలం గ్యాస్ లీకేజీ ప్రభావం: ఏపీ మంత్రి

అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ బాధితులకు భవిష్యత్తు లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.

గ్యాస్ లీకేజీ ప్రభావం ప్రమాద బాధితులపై దీర్ఘకాలికంగా ఉంటుందని  ‘సీఎస్ఐఆర్’-‘ఎన్ఈఈఐఆర్’ నిపుణులు హెచ్చరించారని ఆయన తెలిపారు. ఇప్పటికే బాధితుల ఆరోగ్యంపై పూర్తి బాధ్యత తీసుకుని ప్రభుత్వం వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది అన్నారు.

బాధితులకు రాబోయేకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా చికిత్స అందిస్తామని అన్నారు. ప్రజల క్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్టైరిన్ తరలించేందుకు ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు.

ఎల్జీ పరిశ్రమ ప్రాంగణంలో నిల్వ ఉన్న 13వేల టన్నుల స్టైరిన్ ను సీఎం ఆదేశాలానుసారం దక్షిణ కొరియాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ప్రమాదానికి అవకాశం లేకుండా 13 జిల్లాలలో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.