FbTelugu

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్: కేసీఆర్

1 నుంచి 9వ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నాం

వ్యవసాయ పనులకు మినహాయింపు కోరాం

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి సైతం తెలియచేశానని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ గండం నుంచి బయటపడాలంటే ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలని వినతి చేశారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు పంపిస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

పదో తరగతి పరీక్షలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుని తెలియచేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థును స్వగ్రామాలకు రప్పిస్తారా అని అడగ్గా, ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

కంటైన్మెంట్ ప్రాంతాలలో ప్రజలకు ఇళ్ల వద్దనే నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలందరి సహకారంతోనే కరోనాను నియంత్రించగలిగామని అన్నారు. ప్రజల కనీస అవసరాల కోసం కొన్ని సడలింపులు అవసరమని నొక్కి చెప్పారు.

ఈ సమయంలో తినుబండారాలు, నూనెలు, నిత్యావసర సరకులను కల్తీ చేస్తే ఊరుకోమని కేసీఆర్ హెచ్చరించారు. వారి గురించి తెలిసినా, సమాచారం ఇచ్చినా పీడీ యాక్టు కేసు పెడుతున్నామన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కక్కుర్తి పడడం సరికాదని వ్యాపారులను హెచ్చరించారు.

ఇవాళ ఉదయం మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కనీసం రెండు వారాలు పొడిగించాలని పలువురు సీఎంలు కోరారని అన్నారు. వ్యవసాయ పనులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు. ముఖ్యమంత్రులందరూ ఏకత్రాటిపై వచ్చారని, ఇది మంచి పరిణామమని అన్నారు. లాక్ డౌన్ పై త్వరలోనే ప్రధాని మోదీ అధికారిక ప్రకటన చేస్తారని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రాలు తీసుకున్న అప్పులు ఆరు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. అదే విధంగా ఎఫ్ఆర్ బీఎం ను 5 లేదా 6 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. హెలీకాఫ్టర్ ద్వారా రాష్ట్రాలకు నిధులు పంపించాలని అన్నారు. దేశ జీడీపీ 203 లక్షలు అని, అందులో 5 శాతం మొత్తాన్ని హెలీకాఫ్టర్ మనీ ద్వారా రాష్ట్రాలకు కేటాయించాలన్నారు.

2008 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చిందని అన్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతిన్నందున క్యూఈ విధానమే శరణ్యమన్నారు.

You might also like