-సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ వర్సెస్ నిమ్మగడ్డలా కొనసాగుతోన్న వివాదం మరో కీలక మలుపు తిరింది.
ఫిబ్రవరిలోనే పోల్స్ జరిపేలా ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తాజాగా అనూహ్య ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నో చెబుతుందని తెలిసినా నిమ్మగడ్డ మరోసారి బంతిని అవతలి కోర్టులోకి విసిరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కుదుటపడటంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆరంభించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ గత నెల చివరి వారంలో లేఖ రాయడం తెలిసిందే. కరోనా ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున ఇప్పట్లో ఎన్నికలు కుదరబోవని నిమ్మగడ్డకు నీలం జవాబివ్వడం జరిగింది. సదరు జవాబు రాజ్యాంగ విరుద్ధమని ఎస్ఈసీ ఆక్షేపించడం తెలిసిందే.
ఆ తర్వాత.. ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాలంటూ జగన్ సర్కారు పిటిషన్ వేయడంతో సీన్ హైకోర్టుకు మారింది. అయితే, స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే సీఎస్ సాహ్నికి శుక్రవారం మరో లేఖ రాశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తూ ఎస్ఈసీ లేఖ లో తెలిపింది. తాజాగా లేఖలో హైకోర్టు ఆదేశాలను కీలకంగా ప్రస్తావించారు. పంచాయితీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి నిధులు రాబోవని, ప్రక్రియ నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కే ఉంటాయన్న హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో జరిపేందుకు వీలుగా.. 2021 ఓటరు జాబితా సవరణలను చేపట్టాలని, వచ్చే జనవరి నాటికి ఓటరు జాబితాను పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. తాజా లేఖపై జగన్ సర్కారు ఎలాంటి కౌంటరిస్తుందో చూడాలి.