FbTelugu

మందు తెచ్చిన తంటాలు

లాక్‌డౌన్‌ కాలంలో మూతపడిన మద్యం దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు కట్టలు తెగిన ప్రవాహంలా వాటిముందు వాలిపోయారు.

ఎన్నో రోజులుగా మందుకు దూరమైన వారు ఇంటికి వచ్చేదాకా కూడా ఆగలేక దుకాణాల వద్దే మూతలు విప్పుతున్నారు. అయితే, మద్యం అమ్మకాలు లేని సమయంలో దేశం ఎంతో ప్రశాంతంగా ఉంది. క్రైం రేట్‌ భారీగా పడిపోయింది. మందుబాబుల ఆగడాలు లేవు.

రోడ్డు ప్రమాదాలు అసలే లేవు. మహిళలపై వేధింపులు మచ్చుకైనా కానరాలేదు. కానీ, మళ్లీ మందుషాపులు తెరుచుకున్నాయి. వాటి ప్రభావంతో మళ్లీ క్రైం రేట్‌ తారాజువ్వలా పెరిగిపోతోంది. వికారాబాద్‌ జిల్లాలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఏకంగా కన్నతల్లినే గొంతు పిసికి చంపాడు ఓ ప్రబుద్ధుడు. ఆదివారం నాడు నిర్మల్‌ జిల్లాలో ఓ యువకుడు మద్యం మత్తులో బ్లేడుతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పూటుగా మద్యం తాగిన ఓ యువతి తన ప్రియుడిని ముద్దులతో ముంచెత్తింది. అలా ముద్దులు పెడుతూ అతడి నాలుకను అంగుళం మేర కొరికేసింది. అంతేకాదు ఆ యువతి తన ప్రియుడిని కాలనీలో బహిరంగంగానే ముద్దులతో ముంచెత్తింది. ఈ సంఘటనను కాలనీలోని అనేక ప్రజలు చూస్తున్నారనే విచక్షణను కూడా మరిచింది. మద్యం మత్తులో ఏం చేస్తుందో తెలియకుండా ప్రవర్తించింది. మందు మత్తులో ఉంది కదా అని కాలనీవాళ్లు కూడా వారిని ఏమనకుండా ఊరుకున్నారు.

అలా ఆమె ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తుతూనే ఒక్కసారిగా అతడి నాలుకను కొరికేసింది. దీంతో ఆ ప్రియుడు కుయ్యో.. మొర్రో అంటూ మొత్తుకోక తప్పలేదు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు ఆదివారం ఫుల్లుగా మద్యం తాగి స్వీయ నియంత్రణ కోల్పోయాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలోకి వెళ్లాడు. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న సుబ్బారాయుడు (28) ఆదివారం ఫుల్లుగా మద్యం తాగి వాహనచోదకులను ఇబ్బందులకు గురిచేశాడు. రోడ్డుపై బండరాళ్లను విసురుతూ బీభత్సం సృష్టించాడు.

తర్వాత రోడ్డు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ఫ్యూజ్‌బోర్డును పట్టుకున్నాడు. వెంటనే అతడు విద్యుత్‌షాక్‌తో ప్రాణాలు వదిలాడు. ఇక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు కూడా బాగా పెరిగిపోయాయి. మద్యం లేని కాలంలో భారీగా పడిపోయిన క్రైంరేట్‌ ఆ దుకాణాలు తెరిచిన తర్వాత పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ విషయాలను గమనిస్తున్న ప్రజలు మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తేనే నేరాలు తగ్గి దేశం ప్రశాంతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

You might also like