FbTelugu

మందుబాబుల కొత్త రూటు!

మందుబాబులు కొత్తరూటును ఎంచుకున్నారు. అసలే లాక్‌డౌన్‌ కాలంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచారు.

దీంతో అన్ని డబ్బులు పెట్టి వాటిని కొనలేక.. మందు తాగకుండా ఉండలేక నానా అవస్థలు పడ్డారు. చివరకు బాగా ఆలోచించి కొత్త రూటును ఎంచుకున్నారు. అదే తెలంగాణలో అయితే మద్యం ధరలు తమ ప్రాంతంకంటే తక్కువగా ఉన్నాయన్న విషయం వారికి తెలిసి ఎగిరి గంతేశారు. అక్కడ వేసిన గంతుతో తెలంగాణలో పడ్డారు. ఇంకేముంది ఇక్కడ నుంచి వారికి కావాల్సిన మద్యాన్ని కొనుక్కొని వెళుతున్నారు.

ఏపీ సరిహద్దు మండలాల్లో ఇది నిత్యకృత్యంగా మారింది. ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లను విపరీతంగా పెంచడంతో రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ బాటపట్టారు. ఒక ఫుల్‌ బాటిల్‌పై సగటున రూ.750 వరకు మిగులు ఉండటంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని సరిహద్దు దుకాణాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో స్టాక్‌ లేక అక్కడి దుకాణాలను మూసివేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి కూతవేటు దూరంలో కృష్ణా జిల్లా గ్రామాలు ఉన్నాయి.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం పరిధిలోని అనుమంచిపల్లి, షేర్ ‌మహమ్మద్‌పేట, బూదాడ, అన్నవరం, బలుసుపాడు నుంచి బైక్‌లు, ఆటోలపై పెద్ద సంఖ్యలో వస్తున్న ఏపీ వాసులు కోదాడ మండలంలోని గ్రామాల్లో సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారం నిత్యం కొనసాగుతోంది. తెలంగాణలో దుకాణాలు తెరిచిన రెండో రోజే రూ.20వేల విలువైన స్టాకును అనుమంచిపల్లికి ఆటోలో తరలిస్తుండగా ఏపీ ఆబ్కారీ పోలీసులు పట్టుకొని సరుకును సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు.

చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామానికి ప్రతి రోజు వంద మంది వరకు వస్తున్నారు. గుంటూరు జిల్లా మాదిపాడు తదితర గ్రామాలకు చెందిన వారు పులిచింతల ప్రాజెక్టు మీదుగా ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. కృష్ణా జిల్లా ముక్త్యాల వాసులు కృష్ణా నదిని దాటి దొండపాడుకు వస్తున్నారు. ఇళ్ల మధ్య వైన్స్‌ దుకాణాలు, ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని దొండపాడు మహిళలు ఎక్సైజ్‌ పోలీసులకు తాజాగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అడవిదేవులపల్లి మండల కేంద్రం నుంచి ముదిమాణిక్యం, బాపనకయ్యల మీదుగా కృష్ణా నదిని దాటి ఆవల ఉన్న గోలివాడకు మద్యాన్ని తరలిస్తున్నారు. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు మీదుగా ఆటోల్లో మద్యం తరలుతోంది. అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన వారు ఒక మద్యం కార్టన్‌ను కృష్ణా నది ఒడ్డు వరకు తీసుకెళ్లినందుకు రూ.3వేలు సంపాదిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వారు కృష్ణా నది వరకు వచ్చి ఆ సరుకును తీసుకెళ్లిపోతున్నారు. ఆంధ్రావాసుల కారణంగా పెద్దమొత్తంలో మద్యం విక్రయాలు ఉండటంతో సోమవారం అడవిదేవులపల్లిలో ఓ వైన్స్‌లను ఒక పూట మూసివేశారు. దామరచర్ల మండలానికి గుంటూరు జిల్లా పొందుగుల, రామాపురం నుంచి బైక్‌లపై వచ్చి మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గద్వాల జిల్లా నుంచి కూడా కర్నూలుకు భారీగా మద్యం సరఫరా అవుతోంది.
ఒక్కో కార్టన్‌పై రూ.8,400 మిగులు
కార్టన్‌ అంటే 12 బాటిళ్లు. ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై సగటున రూ.700 మిగులు ఉండటంతో కార్టన్‌ల కొద్దీ మద్యం సరిహద్దు దాటుతోంది. ఫుల్‌ బాటిళ్ల ఒక కార్టన్‌ను తరలిస్తే రూ.8,400 మిగులు ఉండటంతో, ఇక్కడ మద్యం కొనుగోలుకు ఆంధ్రావాసులు ఆసక్తి చూపుతున్నారు. రాయల్‌స్టాగ్‌ ఫుల్‌ బాటిల్‌ ధర తెలంగాణలో రూ.800ఉండగా, ఆంధ్రాలో రూ.1,480, అక్కడికి ఇక్కడికి తేడా రూ.680ఉంది. బ్లెండర్‌స్ప్రైడ్‌ ధర తెలంగాణలో రూ.1,250 కాగా, ఏపీలో రూ.1,910, వ్యత్యాసం రూ.660ఉంది. 100పైపర్స్‌ ధర తెలంగాణలో రూ.2,050 కాగా, ఏపీలో రూ.2,800, వ్యత్యాసం రూ.750 ఉంది. మద్యం ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో ఆంధ్రా వాసులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.