FbTelugu

చ‌ట్టం అండ‌గా చుట్టేద్దాం!

ఏపీలో వైసీపీ బ‌లంగా ఉంది. విప‌క్షాల బ‌ల‌హీన‌త మ‌రింత క‌ల‌సివ‌స్తుంది. కార‌ణాలు ఏవైనా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన మూడు ప్ర‌ధాన‌ పార్టీలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోవ‌టంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి.

ద్వితీయ‌శ్రేణి నాయ‌క‌త్వ లోపం ఇప్పుడు అన్ని పార్టీల‌ను వెంటాడుతున్న స‌మ‌స్య‌. అధికారంలో ఉన్న‌పుడు ప‌వ‌ర్ అంతా ఒకేచోట కేంద్రీక‌రించుకోవ‌టం వ‌ల్ల ఎదుర‌వుతున్న స‌మ‌స్య ఇప్పుడు అన్నిపార్టీలు చ‌విచూస్తున్నాయి. జాతీయ‌స్థాయిలో బీజేపీలో ఆ ఇబ్బంది లేక‌పోయినా ఏపీలో మాత్రం అది స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉంది. అందుకే.. ప్ర‌త్య‌క్ష పోరాటం చేయ‌లేక చేతులెత్తేసిన పార్టీలు.. ప‌రోక్షంగానో.. జ‌నం పేరిటో న్యాయ‌పోరాటాల‌కు దిగుతున్నాయి.

చ‌ట్టాల‌ను అవ‌కాశంగా మ‌ల‌చుకుని న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి. ఫ‌లితంగా త‌ర‌చూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను కోర్టు ఎదుట‌కు తీసుకెళ్ల‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ ప్ర‌య‌త్నం మంచిదే అయినా కేవ‌లం అధికార పార్టీను ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంతో త‌ర‌చూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, శాస‌నాల‌ను ఇరుకున పెట్టేలా చేయ‌టం సామాన్య ప్ర‌జ‌ల‌కూ కొన్నిసార్లు ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి.

ప్ర‌జావేదిక కూల్చివేత నుంచి పేద‌ల‌కు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల వ‌ర‌కూ అన్నింటినీ పెద్ద‌లు హైకోర్టు ప‌రిధికి తీసుకెళ్లారు. అమ‌రావ‌తి రాజ‌ధాని త‌ర‌లింపుపై ఇప్ప‌టికే హైకోర్టులో ప‌లు కేసులు విచార‌ణ‌లో ఉన్నాయి. పేద‌ల‌కు భూ పంపిణీ కోసం ఏకంగా మ‌డ అడ‌వులు కొడుతున్నారంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంపుపై ప్ర‌భుత్వం జారీచేసిన జీఓ పై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఐఐటీ నిపుణుడితో క‌మిటీ వేసి రెండు నెలలు వాయిదా వేశారు.

ఇక‌పోతే.. డాక్ట‌ర్ సుధాక‌ర్ రావు స‌స్పెన్ష‌న్‌.. ఆ త‌రువాత అరెస్టుపై కూడా హైకోర్టుకు వెళ్లారు. జిల్లా న్యాయ‌మూర్తి స్వ‌యంగా డాక్ట‌ర్ సుధాక‌ర్ వాంగ్మూలం తీసుకోనున్నారు. విద్యుత్ బిల్లుల విష‌యంలోనూ హైకోర్టు మెట్లు ఎక్కారు. పిల్ ద్వారా మార్చి, ఏప్రిల్ ‌నెల‌ల బిల్లు చేతికి ఇవ్వ‌టం వ‌ల్ల అధిక‌ బిల్లులు చెల్లించాల్సి వ‌స్తుందంటూ ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. కొన్ని అంశాల్లో ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంటే.. ప్ర‌తి విష‌యాన్నీ వ్య‌తిరేక ఆలోచ‌న‌తో చూస్తూ కోర్టుకు వెళ్లి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను మోకాల‌డ్డ‌టం అభివృద్ధి ని నిలువ‌రించ‌ట‌మే అనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతుంది.

ఏమైనా.. విప‌క్షాలు.. ప్ర‌త్య‌క్షంగా ఎలాగూ వైఫ‌ల్యం అవుతామ‌నే ఉద్దేశంతో ఇలా చ‌ట్టాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌నుకోవ‌టం రాబోయే ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కూ ఓట్లుగా మ‌ల‌చుకునేలా మార‌తాయ‌నేది మాత్రం స‌స్పెన్స్‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.