FbTelugu

ప్రమాద పరిశ్రమలు తరలిద్దాం: సీఎం జగన్

తాడేపల్లి: రాష్ట్రంలో ప్రతి పరిశ్రమను తనిఖీ చేయాలని, ప్రమాదకర పరిశ్రమల తరలింపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వైఎస్. జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటనపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా‌ సమీక్షించారు. సహాయక చర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్‌ లీక్‌ ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరాలు అందించారు.

బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్‌ శానిటేషన్, ఇంటర్నల్‌ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఇచ్చారు, దాని ప్రకారమే శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ రూ.10వేల చొప్పున ఇవ్వాలని, అందర్నీ లెక్కలోకి తీసుకోవాలన్నారు. ఆర్థిక సహాయం పొందేవారి జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరి పేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదు చేసుకోవాలో ఆ వివరాలను అందులో పేర్కొనాలని సీఎం కోరారు.

ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవలకోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. బాధితులను ఆదుకోవడానికి, వారి ప్రాణాలను రక్షించడానికి అధికారులు, పోలీసులు చాలా చక్కగా పనిచేశారని సీఎం ప్రశంసించారు.

స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం…

స్టెరెన్‌ తరలింపు కార్యక్రమం ప్రారంభం అయిందని జగన్ కు జిల్లా కలెక్టర్‌ వివరాలు వెల్లడించారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, సురక్షిత స్థాయిలో ఉందన్నారు. ట్యాంకులోని స్టైరిన్ కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్‌ అయ్యిందని అన్నారు. ఇదికాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టైరిన్ ఉందని, దీన్ని కొరియాకు తరలిస్తున్నామని తెలిపారు. 8వేల టన్నులను ఒక వెసల్‌ ద్వారా తరలిస్తున్నామని, మరొక వెసల్‌కూడా అందుబాటులో ఉందని దీనిద్వారా మిగిలిన 5 వేల టన్నులను కొరియాకు పంపిస్తున్నామని కలెక్టర్‌ వివరంచారు. రానున్న 4–5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

రాష్ట్రమంతటా తనిఖీలు…

ఒక్క విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చేయాలన్నారు. అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైన కూడా ఆలోచించాలని సీఎం సూచించారు. విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల అభిప్రాయాలను కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.