FbTelugu

అక్కడ అడియాసేనా..?

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ప్రధానంగా దాని దృష్టంతా బెంగాల్‌పై ఉన్నప్పటికీ కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనేక రకాల ఎత్తులు వేస్తోంది. వాస్తవానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాచికలు పారుతున్నా కేరళలో మాత్రం ఆ పార్టీ ఎత్తుగడలు పనిచేయడం లేదు. అక్కడ కాలు మోపేందుకు పడరాని పడుతోంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ సీట్లను సాధించలేక పోతోంది. ఎన్నో ఎత్తులు.. పై ఎత్తులతో అనేక ఏళ్లుగా సాగించిన పోరాటం తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు ఒక ఎమ్మెల్యే సీటును సాధించింది. ఇదే పరిస్థితి గత ఎన్నికల వరకు త్రిపురలో కూడా ఉంది. కానీ, అనూహ్యంగా గత ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వాన్ని బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీంతో బీజేపీ నేతలకు కేరళపై కూడా ఆశలు పెరిగాయి. దీంతో ఇప్పుడు కేరళలో కూడా అధికారం రావడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. దానికోసం అనేక ఎత్తులు వేస్తున్నారు.

వాస్తవానికి ఇక్కడ ఒకసారి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మరోసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి కమలనాథులు ఈ ఆనవాయితీకి బ్రేక్‌ వేయాలని చూసింది. కానీ, అక్కడ ఆ పార్టీ పప్పులు ఉడికేలా కనిపించడం లేదన్న విషయాన్ని ఆ పార్టీ జాతీయ నేతలు గ్రహించినట్టున్నారు. అందుకే కేరళలో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతున్నాం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. కేరళలో మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టనుందని ఆయన చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే నతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, బెంగాల్‌లోనూ తమకు విజయావకాశాలు ఉన్నట్టు రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోందని, ఇక, పుదుచ్చేరి, అసోంలలో కూడా తమ కూటమి అధికారంలోకి వస్తుందని నడ్డా చెప్పారు. అయితే, కేరళలో మాత్రం బలమైన శక్తిగా ఎదుగుతామని, కేరళ ప్రజలు ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని నడ్డా చెప్పారు. నడ్డా వ్యాఖ్యలు చూస్తుంటే కేరళలో తమ ఓటమిని ముందే ప్రకటించారన్న చర్చ జోరుగా సాగుతోంది. అక్కడ శబరిమల ఆలయ వివాదాన్ని ఎంత రెచ్చగొట్టినా ఫలితం రాకపోవడంతో నడ్డా ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఈ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందో..

You might also like

Leave A Reply

Your email address will not be published.