కూరగాయల మార్కెట్కు బైక్పై వెళ్లిన వారిని పోలీసులు రోడ్డుపై పట్టుకొని లాఠీలు ఝళిపించారు. లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించారని బైక్ సీజ్ చేశారు. నోటికి మాస్క్ ధరించలేదని అనేకమందికి జరిమానా విధించారు.
రోడ్డు పక్కన పూలమ్ముకుంటున్న వారిని కూడా వదల్లేదు. మీరంతా ఇలా లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే కరోనా కేసులు పెరగక ఏమవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాటిని ఎందుకు పెడచెవిన పెడుతున్నారని పోలీసులు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. అక్కడక్కడా లాఠీలకు కూడా పనిచెప్పారు. ఇదంతా చూస్తుంటే కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంత ప్రాధానం ఇస్తుందో కదా అనిపిస్తోంది కదా.. నిజమే లాక్డౌన్ విజయవంతానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. కానీ, ఇదే లాక్డౌన్ విధించిన పాలకులు మాత్రం యథేచ్చగా వాటిని ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వందల మంది కార్యకర్తలతో పర్యటనలు చేస్తున్నారని ఆ జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. సిద్దిపేట జిల్లాలో మరో మంత్రి హరీష్రావు లాక్ ఎప్పుడో తీసేశారట.
ఇక, స్వయంగా సీఎం కేసీఆరే మొన్న సిద్దిపేట జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్య్రకమాలు, పూజల్లో వందలాది మంది కార్యకర్తలు, అధికారులు భౌతికదూరం పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. పైగా అంతమంది ఒక దగ్గర చేరడం, అందులో కూడా చాలామంది మాస్కులు ధరించకపోవడం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధం. ఇక, అధికార పార్టీ ఎమ్మెల్యేలైతే ఇంతా మా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో పాలకులే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తుండడంతో ప్రజలు ఇదేమి చోద్యమంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. వారు చేసిన నిర్ణయాలను వారే తుంగలో తొక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కోడలుకు నీతులు చెప్పి.. అత్త ఏదో చేసిందన్న సామెతలాగా ఉందని జోరుగా చర్చ సాగుతోంది.