FbTelugu

నేను మంథనిలోనే ఉన్నా: పుట్ట మధు సవాల్

శ్రీధర్ బాబు మీడియాను మేనేజ్ చేస్తున్నారు
విచారణ తరువాత బండారం బయటపెడ్తా

పెద్దపల్లి: నేను ఎక్కడికి పారిపోలేదని, మంథనిలోనే ఉన్నానని పెద్దపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ పుట్ట మధు స్పష్టం చేశారు. న్యాయవాది దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు బహిరంగంగా స్పందించారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు రౌడీయిజం చేస్తున్నారని, గుండాయిజానికి పాల్పడుతున్నారని మధు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక హత్యల్లో నా పేరు అంటగడుతున్నారని, దానికి కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు వంతపాడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ అయిన నేను ఎమ్మెల్యే, ఆ తరువాత జడ్పీ ఛైర్ పర్సన్ కావడాన్ని శ్రీధర్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారని మధు అన్నారు.

ఈ మధ్య సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నన్ను హైదరాబాద్ కు పిలువ లేదని, నేను వారి అప్పాయింట్ మెంట్ కావాలని అడగలేదని కూడా స్పష్టం చేశారు. మర్డర్ విషయంలో పోలీసులను విచారణ చేయిస్తారా లేక శ్రీధర్ బాబు చేస్తారా అనేది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేసేందుకు మా దగ్గర డబ్బులు లేవని, పత్రిలకు ఇచ్చేందుకు పైసలు లేవని అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హైదరాబాద్ లో మీడియా సంస్థలకు డబ్బులు వెదజల్లి నాపై లేనిపోని వార్తలు రాయిస్తున్నారని, హత్యకు నాకు సంబంధాలు అంటగడుతున్నాడని మధు విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాను మేనేజ్ చేస్తే కథనాలు రాస్తారా, తమ రేటింగ్ ల కోసం నన్ను బదనాం చేసి బట్టలిప్పుతారా అని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల దంపతుల హత్య కేసు విచారణ పూర్తయిన తరువాత హైదరాబాద్ కు వచ్చి మీడియా సంస్థ బండారం బయటపెడ్తానని, బట్టలు విప్పుతానని శపథం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.