FbTelugu

బాబుకు కుడి, ఎడమలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి

ధ్వజమెత్తిన నందమూరి లక్ష్మీ పార్వతి

తాడేపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను సైతం ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు నాయుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిని తన కుడి, ఎడమలుగా పెట్టుకుని అక్రమాలు చేస్తున్నాడని నందమూరి లక్ష్మీ పార్వతి ఘాటుగా విమర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై ఈ రెండు ప్రతికల్లో తప్పుడు కథనాలు రాయిస్తే, తన అబద్ధాలు, అసత్యాలతో కూడిన విమర్శలను ప్రచారం చేయించుకోవడంలో ఆరితేరిపోయాడని ఆమె అన్నారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంపై తన అనుకూల మీడియా ద్వారా బురదజల్లించే కార్యక్రమం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లను కీలుబొమ్మలుగా మార్చి, తన ఇష్టం వచ్చిన అబద్దాలను వాటి ద్వారా చంద్రబాబు ప్రచారంలోకి తెస్తున్నాడని అన్నారు.

సైకిల్‌పై తిరిగే వేమూరి రాధాకృష్ణ ప్రతికాధిపతి ఎలా అయ్యాడు?. పచ్చళ్ళు అమ్ముకుని బతికిన సీహెచ్. రామోజీ రావు.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలతో ప్రజలు ఇచ్చిన స్థిరమైన తీర్పుతో జగన్ మంచి పరిపాలనను అందిస్తున్నారని, దీనిని చూసి తట్టుకోలేక చంద్రబాబు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాడని లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్‌తో పాటు నేను కూడా బాధితురాలినే అని ఆమె అన్నారు.
చంద్రబాబు అవినీతిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు తన విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నట్లు లక్ష్మీ పార్వతి వెల్లడించారు.

You might also like