మహబూబ్ నగర్: కరోనా ను ఎదుర్కొనేందుకు భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.
కరోనా కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమైందని, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు అని ఆయన అన్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి తో సహా కింది స్థాయి వరకు అందరూ ప్రాణాలకు తెగించి గొప్ప సేవ చేస్తున్నారన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.
రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన తరువాత మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ కిట్ పథకం అమలు చేసిన తర్వాత మాతా, శిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 నుండి 50 వరకు ప్రసవాలు పెరిగాయని చెప్పారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే చిన్నచూపు ఉండేదని, కానీ ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మారిపోయాయి అని అన్నారు. కేసీఆర్ పార్క్ కు హైదరాబాద్ నుండి కూడా టూరిస్టులు వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే మహబూబ్ నగర్ లో వైద్య కళాశాలను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. వైద్య రంగంలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా ఉందని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం హైదరాబాదు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని అన్నారు.