కరీంనగర్: ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెబితే వినలేదని, ఆ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇవాళ చొప్పదండిలో నిర్వహించిన హరితహారంలో కేటీఆర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా పద్మారావు మాస్క్ లేకుండా తన వద్దకు రాగా, మాస్క్ ఇచ్చానన్నారు. దాన్ని మడతపెట్టి తన జేబులో పెట్టుకున్నాడని కేటీఆర్ వివరించారు. ఇలా చేయడం మూలంగానే ఆయనకు కరోనా సంక్రమించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, కరోనా నుంచి స్వీయ రక్షణ పొందాలన్నారు. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు పైశాచిక ఆనందాన్ని సూచిస్తున్నాయన్నారు. మేము కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించవచ్చని, ఇది సరైన సందర్భం కాదన్నారు.