FbTelugu

టీచర్ పిల్లలకు పరిహారం చెల్లించాలి: మంద కృష్ణ మాదిగ

నాగార్జున సాగర్: ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్ రవికుమార్ దంపతుల ఇద్దరు పిల్లలకు చేరో 50 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
రవికుమార్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.92 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, అక్కమ్మ దంపతుల పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారి మీద ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ పూట గడవక తిండి దొరకక ఆర్థిక ఇబ్బందుల్లో కుమిలిపోయి రవి కుమార్, అక్కమ్మ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు. వీరి మృతికి కెసిఆర్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు తెచ్చుకున్నాడే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య నుండి పుట్టిందని, రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లంతా ఎస్సి, ఎస్టి, బిసి నిరుద్యోగులేనని అన్నారు. ఆయన అహంపూరిత విధానాలే నిరుద్యోగుల మరణాలకు కారణమని అందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రవి కుమార్ అక్కమ్మ దంపతుల మృతితో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మారారని, వారి ఇద్దరి పేరు మీద చెరో రూ.50 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ లో ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించినట్లుగానే రవి కుమార్ తల్లికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ ఆందోళనలో రవి కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పార్టీ నేతలు జానకి రామయ్య చౌదరి, మంద మోహన్ రావు, మాల మహానాడు ఐక్య వేదిక నాయకులు సాగర్ బాబు, మైసగళ్ల బుచ్చింద్ర, అందుగుళ్ల రాజీవ్ మాదిగ పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.