FbTelugu

వారిచూపు.. సీపీఎం వైపు !

కేరళ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. కేరళ కాంగ్రెస్‌ (ఎం) పార్టీ ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో భాగస్వామిగా కొనసాగింది. అయితే, కొంతకాలం క్రితం వచ్చిన తేడాలతో కేరళ కాంగ్రెస్‌ (ఎం) పార్టీ యూడీఎఫ్‌కు దూరమైంది. అయితే, ఆ పార్టీ ఇప్పుడు యూడీఎఫ్‌ శిబిరం నుంచి ప్రత్యర్థి అయిన సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌తో కలిసేందుకు అడుగులు వేస్తోంది. యూడీఎఫ్‌ నుంచి బయటికి వచ్చిన జోస్‌ కె మణి నాయకత్వంలోని కేరళ కాంగ్రెస్‌(ఎం) పార్టీ పాలక ఎల్‌డీఎఫ్‌ వైపు చూస్తోంది. ఈ పరిణామాలను కాంగ్రెస్‌ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) నిర్ణయంపై వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. అదే సమయంలో సమస్య పరిష్కారం బాధ్యతను యూడీఎఫ్‌కు కట్టబెట్టింది.

కేరళ కాంగ్రెస్‌(ఎం)ను తిరిగి తన వద్దకు రాబట్టుకోవడానికి పరోక్షంగా పావులు కదుపుతోంది. కేసీ(ఎం) పార్టీకి రెండు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. కొట్టాయం జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవి విషయంలో పీజే జోసెఫ్, జోస్‌ కె మణి నాయకత్వంలోని కేసీ(ఎం) రెండు వర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో జోస్‌ కె మణి వర్గం యూడీఎఫ్‌కు దూరమైంది. ఇదే అదనుగా ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘కేరళ కాంగ్రెస్‌(ఎం) యూపీఏ భాగస్వామి. యూపీఏలో భాగస్వామి ఎప్పుడైతే అయిందో అప్పుడే యూడీఎఫ్‌తోనూ కలిసి ఉంది. రాష్ట్ర స్థాయిలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా అధిష్టానం చెప్పింది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు పీటీఐకి చెప్పారు. జోస్‌ కె మణి వర్గంతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా అని అడుగగా ఏమి జరుగుతుందో వేచిచూద్దామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గాల మధ్య సమస్యను పరిష్కరించడంలో యూడీఎఫ్‌ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) ఎల్డీఎఫ్‌ వైపు వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You might also like