FbTelugu

శభాష్‌.. కేరళ

కరోనా ఆనవాళ్లు దేశంలోనే ముందుగా కనిపించింది కేరళ రాష్ట్రంలోనే. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో అది ఎంతో కట్టడి అయింది. అయితే, అనేక రాష్ట్రాలు ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని దాటి కరోనా బారిన పడ్డాయి.

కొన్ని రాష్ట్రాల్లో రోజుకు 50మందికి పైగా వైరస్‌ బారిన పడుతూనే ఉన్నారు. కరోనా కట్టడికి దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఎక్కువగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని యావత్‌ దేశంలోని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. ఆ రాష్ట్రం చేపట్టిన చర్యల గురించి ప్రజలు చెప్పుకోవడమే కాదు.. కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ విషయాన్ని చెప్పింది.

కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సహాయ శిబిరాల్లో 70శాతం శిబిరాలను కేరళ ప్రభుత్వం నిర్వహిస్తోందని కేంద్రం ఆ నివేదికలో పేర్కొంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర సర్కారే తెలిపింది. దీని ప్రకారం దేశం మొత్తంమీద 22,567 సహాయ శిబిరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఒక్క కేరళ ప్రభుత్వమే 15,541 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది.

దేశంలోని అన్ని శిబిరాల్లో మొత్తంమీద 6,31,119 మంది ఆశ్రయం పొందుతుండగా, ఒక్క కేరళలోనే 3,02,016 (47.9శాతం) మంది ఆశ్రయం పొదుతున్నారు. అదే సమయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద కేంద్రం వివిధ రాష్ట్రాలకు 11,092 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తంలో కేరళకు కేవలం రూ.157 కోట్లు మాత్రమే కేటాయించింది. మిగతా రాష్ట్రాలకు కేంద్రం అధిక మొత్తం నిధులిచ్చి కేరళకు చాలా తక్కువగా ఇచ్చినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వైరస్‌ను అరికట్టే పనిలో కూడా అగ్రభాగంలో ఉండడాన్ని దేశంలోని ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. అంతా శభాష్‌ కేరళ అంటూ అక్కడి పాలకులు, అధికారులకు రెడ్‌షెల్యూట్‌ చేస్తున్నారు.

You might also like