FbTelugu

ఏపీ, కేంద్రంపై భగ్గుమన్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు విషయంలో ఏపీ అర్థంపర్థం లేని రాద్ధాంతం చేస్తోందని, కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందుపెట్టి వాదనలు సమర్థవంతంగా వినిపించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు కేంద్రానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు చేయడంపై కేసీఆర్ మండిపడ్డారు.

అపెక్స్ కౌన్సిల్ లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నా అంతటా నేనే ఏపీ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మాట్లాడాను. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం ఇచ్చాను. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాను. అపెక్స్ కౌన్సిల్ లో ఏపీ నోరు మూయించేలా, అర్థ రహిత వాదనలు తిప్పి కొట్టేలా సమాధానం చెబుతామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తకుండా చేసే పరిస్థితిని ఏపీకి కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

You might also like