FbTelugu

కరోనాతో రాష్ట్రానికి రూ.1 లక్ష కోట్ల నష్టం: కేసీఆర్

కరోనా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేదు
సినిమా వల్ల ఒత్తిడితో థియేటర్లు మూయలేదు
ప్రతి మున్సిపాల్టీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
ఆర్టిసి ఉద్యోగుల జీతాలు పెంచుతాం
వీఆర్వో తప్పులతో తహసీల్దార్లను కాల్చేస్తున్నారు
హైదరాబాద్: ప్రతిపక్షాలు అతిగా చెబుతున్నట్లుగా అప్పులు తెలంగాణలో లేవని, అప్పులు చేయడంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని, ప్రచారం చేసినంతగా అప్పులు పెరగలేదని సిఎం కెసిఆర్ అన్నారు. కరోనా వల్ల ప్రపంచం అంతా దెబ్బతింటే రాష్ట్రం తట్టుకుని కోలుకుంటున్నదన్నారు.

అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు అప్పులు చేయాలంటే ఎన్నో నియంత్రణలు ఉంటాయన్నారు. అతి తక్కువ అప్పులు చేసి పటిష్టమైన ఆర్థిక కార్యక్రమాలు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. అప్పుల్లో 33శాతం ఉత్తర ప్రదేశ్, 34 శాతం మధ్య ప్రవేశ్ ఉంటే కేవలం 22 శాతంతో తెలంగాణ తక్కువ స్థాయిలో ఉందన్నారు. అప్పులు చేయడమే కాదు వాటిని సద్వినియొగం చేసుకునే తెలివి ఉండాలన్నారు. కరోనా వైరస్ మూలంగా రాష్ట్రానికి రూ.1లక్ష కోట్ల నష్టం వచ్చి పెద్దదెబ్బ తగిలిందన్నారు. పదేళ్ల క్రితం క్యాపిటల్ వ్యయం 54 వేలు ఉంటే.. ప్రస్తుతం ఇప్పుడు 2లక్షల 34వేలు ఉందని సిఎం అన్నారు.
దేశంలో మళ్ళీ రోజుకు 65వేల కేసులు వస్తున్నాయని, కరోనా అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది ప్రపంచానికి అర్థం కావడం లేదన్నారు. ఈ రోగం వల్ల రాష్ట్రంలో సంక్షేమం ఆపలేదన్నారు. భట్టి విక్రమార్క వ్యంగ్యం ఉండాల్సినదాని కంటే ఎక్కువ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఇప్పటికే పండుగ చేశాం. ఇండియాలో రైతు బంధు- భీమా ఎక్కడైనా ఉందా?. కాంగ్రెస్ పార్టీకి రైతుబంధు- భీమా పెట్టాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్లో లోపాలు ఉన్నాయన్నారు. దేశంలో అన్ని రకాల ధాన్యం కొన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేశారు. కోటి ఎకరాలు అనేది మా కళ కానీ.. 1కోటి 25లక్షలకు ప్రస్తుతం చేరింది. తెలంగాణ జీడీపీ పెరిగింది అంటే ప్రధాన కారణం వ్యవసాయరంగం పురోగతి మాత్రమే. జిఎస్డిపి 4 లక్షల నుంచి 9 లక్షలకు పెరిగిందని కెసిఆర్ అన్నారు.

దేశం సేకరించిన ధాన్యంలో 55శాతం తెలంగాణ ఇచ్చిందని తెలుసుకొని సంతోషపడ్డాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగాల్లో పురోగతి ఉంది. 28వేల మెగావాట్లు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం తెలంగాణ ఉందని సీఈఏ చెప్పిందన్నారు. 40ఏళ్ల బాండ్ పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వందశాతం ఇరిగేషన్ – ఇతర మౌలిక వసతులు పూర్తి చేసుకుంటామన్నారు. ప్రపంచం, దేశం ఆశ్చర్యపడే విధంగా వెజ్ & నాన్ వెజ్ మార్కెట్లు ప్రతి మున్సిపాలిటీ లలో నిర్మిస్తామన్నారు. వీటిని 140 మున్సిపాలిటీ లలో నిర్మించబోతున్నామన్నారు. త్వరలోనే హైదరాబాద్ ధూల్ పేట్ లో నేను, మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తుందన్నారు.
ఆర్టిసి ని కాపాడుతున్నామని, ఉద్యోగుల జీతాలు త్వరలోనే పెంచుతామన్నారు. దేశంలోనే అత్యుత్తమ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ వారేనన్నారు. రాష్ట్ర సంపద ఇలాగే పెరగాలని, ఉద్యోగుల జీతాలు మరింత పెరగాలని కోరుకుంటున్నాను. పెరుగుతున్న సంపద రాష్ట్ర ప్రజలందరికీ అందాలని కోరుకుంటున్నా.
నాగార్జున సాగర్ లో 1లక్షా 53వేల లబ్ధిదారులు ఉన్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులను నాయకులు వెళ్లి కలవాలని సూచించాను. మేము కొన్ని పథకాలను ఢిల్లీ ప్రభుత్వం నుంచి సేకరించాం. బస్తి దవాఖాన అనేది బస్తి ప్రజలు కలగన్నారా?. చేసి చూపిస్తున్నాం.

ఎస్సీ సబ్ ప్లాన్ పై గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆధారం లేకుండా గాలి ఆరోపణ చేస్తున్నారు. దళితుల కోసం ప్రత్యేకంగా రూ.1వెయ్యి కోట్లు కేటాయించాము. దళితల అభివృద్ధి కోసం దళిత మంత్రి, ఎమ్మెల్యేలు సమావేశం పెడుతామని, ఆ సమావేశానికి విక్రమార్కను కూడా పిలుస్తామన్నారు. పోడు భూముల విషయంలో వేధింపులు వద్దని ఆదేశాలు ఇచ్చాము. పోడు భూముల సమస్యల పై ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలనే సంకల్పం ఉందని, ఇతర రాష్ట్రాల నివేదికలు తెప్పించే సమయానికి కరోనా వచ్చిందన్నారు. కచ్చితంగా నిరుద్యోగ భృతి పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. హాస్టల్ విద్యార్థులకు పెంచాల్సిన చార్జీల పై నిర్ణయం తీసుకుంటాం. అసైన్డ్ భూముల పై అఖిలపక్ష నిర్ణయం జరగాలి. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టాలని అనుకుంటున్నామని, అవసరం అయితే చట్టంలో మార్పులు చేద్దామన్నారు.
వీఆర్వోలు చేసే తప్పుల వల్ల బాధిత రైతు తహసీల్దార్ పై పెట్రోల్ పోసి.. హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ రికార్డ్స్ మార్చరన్నారు. తెలంగాణ వస్తే భూముల ధర తగ్గుతాయని ప్రచారం జరిగిందని కాని రెట్టింపు అయ్యాయన్నారు. తెలంగాణలో రూ. 30లక్షలకు ఒక ఎకరా అమ్మి… ఏపీలో 15లక్షలకే ఎకరా కొంటున్నారు. భూ సమస్యలు- ధరణి సమస్యలు కొద్దీ రోజుల్లో పూర్తిగా పోతాయని, ధరణి ధిక్సూచిగా మారుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే విద్యా- వైద్యం పై దృష్టి పెడుతామని, విద్యారంగం నిధులు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. ఏపీ ప్రాజెక్టుల పై కేంద్రానికి ఫిర్యాదు చేసాము, నీటి హక్కుల విషయంలో రాజీపడం. తెలంగాణ అసెంబ్లీ మొత్తం ఢిల్లీలో పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ హక్కులను కాపాడుకుంటుంది. 15 టీఎంసీల నీళ్లు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమన్నారు.
కరోనా విస్ఫోటనం కాక ముందే చర్యలు తీసుకోవాలని స్కూల్స్ తాత్కాలికంగా మూసివేశామన్నారు. సినీ పరిశ్రమ వాళ్ళు కలిసి సినిమహాళ్లు బంద్ చేయద్దని కోరారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమానంగా వ్యాక్సిన్ డోసులు ఇస్తోంది. లాక్ డౌన్ పై అపోహలు వద్దు మళ్ళీ లాక్ డౌన్ ఉండదన్నారు. తొందరపడి ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకోమని కెసిఆర్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.