FbTelugu

పోలీసులను డిస్మిస్ చేస్తా: కెసిఆర్

హైదరాబాద్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం హెచ్చరించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్ చెందిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని కెసిఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కోరారు. చింతకాని కి వెళ్లి లాకప్ డెత్ సంఘటన కు సంబంధించి పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపి ఎం. మహేందర్ రెడ్డి ని సిఎం ఆదేశించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. లాకప్ డెత్ ఘటనపై అడ్డగూడూరు పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన బాధితురాలి నివాసం చింతకానికి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపి నామా నాగేశ్వర్ రావు సహా, జిల్లా కలెక్టర్, ఎస్పి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సిఎం సూచించారు. దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదన్నారు. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదన్నారు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలని డిజిపిని మహేందర్ రెడ్డి ని ఆదేశించారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.