FbTelugu

యాదాద్రి పునః ప్రారంభం మే నెలలో: కేసీఆర్

యాదాద్రి: పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యం లో, యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కెసిఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతి నీ క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యం లో.. ఇంకా అసంపూర్తి గా వున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి కి చేరుకున్న సీఎం, తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలొ ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు.

ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్, మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు,శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణీ, భక్తుల స్నాన గుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణం పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. తుది మెరుగులు దిద్దు తున్న నేపథ్యంలో, దేశంలోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా…నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహరీని ఆనుకుని వుండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కెసిఆర్ కోరారు. మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు.
గర్భగుడి ముందరి ధ్వజస్థంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగులను పరిశీలించారు. నృసింహ స్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు. ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, దాన్నే కొనసాగించాలని సూచించారు. అవసరమైతే చైనా సందర్శించి, అక్కడ 7 కి.మీ. దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను సీఎం కెసిఆర్ కోరారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో సిఎం అధికారులకు సూచనలిచ్చారు.

ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా… రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తి నీ వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయ పై పరిసరాలను పరిశీలించిన అనంతరం కిందికి దిగి, గుట్ట చుట్టూ చేపట్టిన, రహదారులు, బస్ స్టాండ్, రెసిడెన్షియల్ కాటేజ్ లు, కళ్యాణ కట్ట, పుష్కరిణీ, అన్నదాన సత్రం,తదితర అభివృద్ది పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మిత మౌతున్న రింగు రోడ్డు లోపలి పరిధిలో పరిసర ప్రాంతాలను పచ్చదనంతో పరిపూర్ణం చేసి, దైవ భావన పరివ్యాప్తం చేయాలని సీఎం కెసిఆర్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.