FbTelugu

కేసీఆర్ ఆరోగ్యంపై స్పష్టతనివ్వాలి: రేవంత్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తక్షణమే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ కి కరోనా అని వార్తలు వస్తున్నాయి, ఆయన ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచడం నేరమని రేవంత్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేరని,  రాష్ట్రంలో పరిపాలనా సంక్షోభం ఏర్పడిందన్నారు. మంత్రులు ఏం మాట్లాడాలో తెలియక పరమానందయ్య శిష్యులయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ పాలన అందించలేని పరిస్థితి ఉంటే… తాత్కాలికంగా వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. మేనల్లుడు టీ. హరీశ్ రావు, కుమారుడు కేటీఆర్ లేదా మంత్రి ఈటల లేదంటే ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సీఎం ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో దాక్కోవడం సరి కాదన్నారు. గత నెల 28 నుంచి సీఎం జాడ లేదన్నారు.

లాక్ డౌన్ పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి, పది రోజులైనా అతీగతీ లేదు… జనం గందరగోళంలో ఉన్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై సొందర రాజన్ జోక్యం చేసుకుని పాలనను సమీక్షించాలని కోరారు. గవర్నర్ సమావేశానికి పిలిచినా రాని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు గ్రేటర్ హైదరాబాద్ పై సర్వాధికారాలు ఉంటాయని గుర్తు చేశారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది, జర్నలిస్టులకు స్పెషల్ డ్రైవ్ పెట్టి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సచివాలయం భవనాలు కూల్చివేత దుర్మార్గ చర్య అన్నారు. ఆ స్థలంలో కొత్త సచివాలయం కట్టడానికి ఎన్జీటీ చట్టం అనుమతించదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

You might also like