FbTelugu

కేసీఆర్‌ తప్పుకుంటే..!

ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌ అంతా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ గురించే. వచ్చే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తప్పుకొని ఆ స్థానంలో ఆయన తనయుడు కేటీఆర్‌ను కూర్చోబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా చేస్తున్న ప్రకటనలు ఇది నిజమేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంతగా ప్రచారం సాగుతున్నా దీనిపై ఇంతవరకు కేసీఆర్‌ గానీ, కేటీఆర్‌ గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే కేటీఆర్‌కు పట్టాభిషేకం ఖాయమేనని అనిపిస్తోంది.

అయితే, దీనివెనుక మరో తిరకాసు కూడా ఉందన్న విషయంపై టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చర్చ కూడా సాగుతోంది. అదేంటంటే.. కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తే పార్టీ నేతలంతా సహకరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన మాట వింటారా అని ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది. వాస్తవానికి కేటీఆర్‌ను సీఎంను చేస్తే అందరూ ఆయన మాట వినడం కోసమే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల వ్యవహారం మొత్తం కేటీఆర్‌కు అప్పగించారు. ఆయన ద్వారా టికెట్లు సాధిస్తే ఆయనకు అనుకూలంగా ఉంటారనే భావించే కేసీఆర్‌ ముందస్తుగా అలా చేశారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయినా, కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకు స్వేచ్ఛనివ్వడం లేదని, ప్రతి శాఖలోనూ వారి పెత్తనమే సాగుతోందని, మంత్రులుగా తాము తమ శాఖలపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారు. అన్ని శాఖలు కేటీఆర్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉంటేనే కేటీఆర్‌ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నామని.. ఇక కేటీఆరే సీఎం అయితే తమ పరిస్థితి ఏమిటని మంత్రులు నారాజ్‌ అవుతున్నారట. ఇక సీనియర్‌ మంత్రుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని కూడా జోరుగా ప్రచారం అవుతోంది. కేసీఆర్‌ రాజకీయ జీవితంలో మొదటి నుంచీ ఆయన వెన్నంటి ఉన్న హరీష్‌రావు పరిస్థితి ఏంటన్న విషయంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది.

కేటీఆర్‌పై ఇప్పటికే హరీష్‌రావుకు విభేదాలున్నాయని జోరుగా ప్రచారం సాగింది. దీంతో వారిద్దరూ అనేక సందర్భాల్లో దానిని కొట్టేసినా కార్యకర్తలు నమ్మే పరిస్థితిలో లేరు. హరీష్‌రావును కొన్నాళ్ల పాటు మంత్రి పదవికి దూరం చేయడం, ఆ తర్వాత పదవి ఇచ్చినా ప్రాధాన్యం లేని ఆర్థిక శాఖను అప్పగించడంపై ఆయన కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. పైగా ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని, కొందరు ఎమ్మెల్యేలను తీసుకొని కమలం గూటికి చేరతారని కూడా ప్రచారం సాగింది. తమతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని, కేటీఆర్‌ను సీఎంగా చేస్తే వారంతా తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉన్నా అబద్ధం ఉన్నా ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగితే టీఆర్‌ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుందేమోనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.