FbTelugu

ప్రజల రక్తం కూడు తింటున్న కేసీఆర్: విజయశాంతి

హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని, టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావటం‌ ఖాయమని ఆమె అన్నారు.

పార్టీలో చేరిన తరువాత తొలిసారి విజయశాంతి రెడ్డి బీజేపీ కార్యాలయానికి ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నాడన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల కంటే.. డబ్బు మీదనే ఎక్కువ ప్రేమ అన్నారు. రాఖీ కట్టిన అక్కా, చెల్లెళ్ళకు ఒకప్పుడు రూ.1 లక్ష కూడా ఇవ్వలేని కేసీఆర్ కు లక్ష కోట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు సాయం ఎందుకు చేయటం లేదో చెప్పాలని విజయశాంతి రెడ్డి నిలదీశారు. తెలుగుదేశంలో మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే కేసీఅర్ ఉద్యమంలోకి వచ్చాడని, లేకుండా వచ్చేవారు కాదని అన్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నారని ఆమె వివరించారు. కేసీఆర్… నాకంటే గొప్ప నటుడు అని ఆమె అన్నారు. తన కుటుంబం నుంచి ఎవర్నీ రాజకీయాల్లోకి తీసుకురానన్న కేసీఆర్ మాట తప్పాడన్నారు.

తల్లి తెలంగాణ పార్టీని స్వార్థంతోనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కాని సఫలం కాలేకపోయారన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో నన్ను తిట్టించాడన్నారు. బీజేపీ నాకు తల్లి లాంటి పార్టీ‌‌ అని, ప్రత్యేకమైన కారణాలతోనే బీజేపీని వీడాను తప్ప మరోటి కాదన్నారు. చంద్రబాబు నాయుడు కారణంగానే అప్పట్లో బీజేపీని వీడాను అన్నారు. 1998నుంచి తెలంగాణ కోసం పోరాటం చేశాను, ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడున్నాడో ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని విజయశాంతి రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.