కరోనా కష్టమొచ్చినా రాజకీయాలు రాజకీయాలే. ఖద్దరు నేతలు.. ఖద్దరు నేతలే. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తమ డీఎన్ఏలో ఉందంటూ చెలరేగటం వారికి కొత్తేం కాదు.
అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు.. మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేమే గెలిచామంటూ ప్రభుత్వం నడిపే పార్టీలు చెప్పటం పరిపాటే. కరీంనగర్లో కాషాయం వర్సెస్ గులాబీ అన్నట్టుగా రసవత్తరమైన పోరు మొదలైంది. ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ.. తమకు ఆయువుపట్టుగా భావించే కరీంనగర్లో మాత్రం.. పార్లమెంటరీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పక్కా అనుకున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓడారు. అది గులాబీకు ఆనందాన్నిచ్చింది. కాషాయంపై పై చేయి సాధించామనే ధీమాను పెంచింది. పార్లమెంటరీ ఎన్నికల్లో అదే బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలవటం పరువు పోయినంత పనిగా భావించింది. పైగా.. అదే ఊపుతో బండి ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా మరో మెట్టు పైకెదిగారు.
దీంతో కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు మాంచి గుర్రుగా ఉన్నాయి. బండిని ఎంపీగా గుర్తించటం పక్కనబెట్టి,.. ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. ఈ నేపథ్యంలోనే అదే జిల్లాకు చెందిన మంత్రి గంగుల ప్రభాకర్ తెర వెనుక నుంచి బండిపై విమర్శలు కురిపిస్తున్నాడు. బండి సంజయ్ ఎంపీగా తమకు అందుబాటులో లేరంటూ గులాబీ పార్టీ ఏకంగా ధర్నాల చేస్తుంది. బావుపేటలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొందరు తమ ఎంపీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి పోటీగా.. బండి సంజయ్ అనుచరులు.. మంత్రులు తమ గ్రామాలకు రావట్లేదంటూ బీజేపీ అభిమానులతో కనిపించట్లేదనే ఫిర్యాదు కూడా ఠాణాల్లో ఇచ్చారట.
ఇదిలా ఉంటే.. బీజేపీ కార్పోరేటర్ ఒకరు ఇటీవల కాషాయ జెండా వదిలేసి గులాబీ గూటికి చేరటం చర్చనీయాంశంగా మారింది. ఇలా.. బండిని ఎలాగైనా అభాసుపాల్జేయాలనే ఎత్తుగడ వెనుక గంగుల ఉన్నాడనే విమర్శలున్నాయి. ఆయన మాత్రం నాకు ఇటువంటి రాజకీయాలు నచ్చవంటూ తేల్చిచెప్పారు. ఇంతకీ.. అసలు విషయం ఏమిటంటే.. ఇలా ఇరు పార్టీల్లో ఉండి పోటాపోటీగా గొడవపడుతున్న ఇద్దరు నేతలూ.. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటం విశేషం.