FbTelugu

కమలంలో జగడమేనా..?

తెలంగాణలో అధికారంపై కమలనాథులు కన్నేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో విజయాలు సాధిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల నుంచే తమ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు.

వారు చెప్పినట్టే జైత్రయాత్ర ప్రారంభమైంది. దుబ్బాక ఫలితాల తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించారు. కొన్ని డివిజన్లలో గుర్తింపులేని వారు సైతం బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారంటే అది బీజేపీ హవానే. ఈ వరుస విజయాలతో తెలంగాణలో ఇక టీఆర్‌ఎస్‌ తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. బీజేపీ నేతలంతా బాగా జోష్‌లో ఉన్నారు. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అన్న ధీమా కూడా వారిలో పెరిగింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో పంచాయితీ పెట్టనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇక, తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని భావించిన కమలం నేతలు సీఎం పీఠంపై కన్నేశారు. సీఎం పదవి తనకే దక్కాలని పలువురు నేతలు పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి అనుగుణంగానే ఇటీవల బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బయటపెట్టాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి సోయం వ్యాఖ్యానించడం బీజేపీలో కలకలాన్ని రేపింది.

వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీకి హైప్‌ రావడానికి తానే కారణమని, తన విధానాలను ఆచరణలో పెట్టడమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుకుంటున్నారు. పరిస్థితిని చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు కూడా ఇదే భావనలో ఉన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేది తానే కాబట్టి తనకే సీఎం సీటు దక్కుతుందన్న భావనలో సంజయ్‌ ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. బయటకు చెప్పకపోయినా, ప్రచారం జరగకున్నా ఇంకా అనేకమంది నాయకులు సీఎం పీఠంపై కన్నేసి పావులు కదుపుతున్నారు. అసలు పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉంది. అధికారాన్ని చేపట్టాలంటే కేవలం ఈ రెండు ఎన్నికల్లో విజయమే సరిపోదు. నిజానికి బీజేపీ బలం నగరాలకు పరిమితమైందని, పల్లె ప్రాంతాల్లో ఆ పార్టీ జాడలు లేవన్న సంగతి కమలనాథులకు కూడా తెలుసు. పల్లెల్లో పార్టీ బలోపేతం కాకుండా సీఎం పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సమయంలో నేతలు అప్పుడే సీఎం ఎవరనే దానిపై ప్రకటనలు చేయడం హాస్యాస్పదమే అవుతుందని రాజకీయ పరిశీలకులతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. మొత్తానికి సోయం బాపూరావు ప్రకటనతో తెలంగాణ బీజేపీలో కోల్డ్‌వార్‌ ముదురుతుందని అంతా భావిస్తున్నారు. సీఎం పదవి తనకే దక్కాలని బీసీ సామాజికవర్గానికి చెందిన మరోనేత కూడా ఇప్పటినుంచే లాబీయింగ్‌ నడుపుతున్నట్టు ప్రచారంలో ఉంది. మరి ఆ నేత ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాల్సిందే. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు మాత్రం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.