సైనికుడు కావాలని.. దేశ రక్షణకు అంకితం కావాలని కలలు కన్నాడు. కానీ, ఆ కల నెరవేరలేదు. తను సాధించలేనిది తన కొడుకు అయినా సాధిస్తాడని అనుకున్నాడు ఆ తండ్రి. తండ్రి కలను నెరవేర్చేం దుకు ముందుకు వచ్చాడు ఆ కొడుకు. సైన్యంలో చేరాడు. వీరోచిత పోరాటం చేశాడు. ఆ పోరులో వీరమరణం పొందాడు. అతడే సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు. తండ్రి కలను నెరవేరుస్తూ సైన్యంలో చేరాడు… 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కల్నల్ స్థాయికి ఎదిగాడు.
ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా లాక్డౌన్ వల్ల రాలేక సరిహద్దులో విధులు కొనసాగించాడు. ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. బాగున్నావా’అంటూ పలకరించాడు. కానీ అనూహ్యంగా 24 గంటలు అయినా గడవకముందే చైనా సైన్యం దాష్టీకంలో వీరమరణం పొందాడు. ఇదీ విధి నిర్వహణలో అసువులు బాసిన తెలుగుతేజం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) ప్రస్థానం. భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నేపథ్యమిదీ…
తండ్రి కల కోసం…
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైరైన ఉపేందర్‌కు బాల్యంలోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవడంతో ఆ కోరికను ఎలాగైనా తన కుమారుడి రూపంలో చూడాలనుకున్నారు. సంతోష్ సైతం తండ్రి కలను నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్ 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్లో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు.
అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు. సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్తోగల సరిహద్దులో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు.
బదిలీ అయినా…
కల్నల్ సంతోష్‌ను ఇప్పటికే హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.