FbTelugu

జూన్ 13న జర్నలిస్టుల ఉపవాస దీక్ష

హైదరాబాద్: కరోనా కాటుకు గురవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 13న హైదరాబాద్ లో ఒక రోజు ఉపవాస దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) స్పష్టం చేసింది.

బుధవారం నాడు బషీర్ బాగ్ లోని దేశోద్ధార కభవన్ లో జరిగిన యూనియన్ ముఖ్య బాధ్యుల సమావేశంలో రాష్ట్రంలో జర్నలిస్టుల స్థితిగతుల పై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు మాట్లాడారు.

గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే విలేకరి మనోజ్ కుమార్ యాదవ్ బలైపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకొనే విషయంలో కూడా ముందుకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది పాత్రికేయులు కరోనా కాటుకు గురై చికిత్సాపరంగా పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీయూడబ్ల్యూజే ఆందోళనకు పూనుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు. మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా కరోనా కాటుకు గురైన మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని కేటాయించాలన్నారు. అత్యవసర సేవల విభాగం కింద పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 50లక్షల ఆరోగ్య బీమాను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని వారు కోరారు. పై డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో జర్నలిస్టులను ఆదుకోవడానికి తాము భిక్షాటనకు సిధ్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

You might also like