FbTelugu

‘3 రోజుల్లో విధుల్లో చేరండి.. లేదంటే’: కేసీఆర్

Join-in-duties-within-3-days-says--KCR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటనలను చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మే ప్రధాన అజెండాగా క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 49 అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిందని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించామని, పండుగలు, పరీక్షల వంటి కీలక సమయాల్లో బెదిరింపులకు దిగుతూ, సమ్మెలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇది ఒకరకమైన బ్లాక్ మెయిల్ అని అన్నారు. సమ్మెకు వెళ్లకూడదని ఆర్టీసీ కార్మికులకు చెప్పినా వినలేదని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు స్థానం కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని అన్నారు. అందుకే 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని క్యాబినెట్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. నవంబరు 5 అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరకపోతే ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మాత్రం కేసీఆర్ చాలా కఠినంగానే ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

You might also like