ముంబై: మరో మూడు నెలల్లో తక్కువ ధరలో 4జీ మొబైల్ ఫోన్ తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఆరు నెలల్లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు.
సెప్టెంబర్ నెలలో ఆశించిన స్థాయిలో జియో లోకి వినియోగదారులు రాలేదు. ఎయిర్ టెల్ లో మాత్రం 36 లక్షల మంది చేరడం జియోను ఆలోచనలో పడేసింది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు తక్కువ ధరలో 4జీ ఫోన్ ను తీసుకువచ్చే పనులు వేగవంతం చేశారు.
రూ.5వేల కన్నా తక్కువ ధరలోనే దీనిని తీసుకురానున్నట్లు సమాచారం. గూగుల్ తో జతకట్టి ఈ మొబైల్ ఫోన్ ను తీసుకురానుండడంతో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాఫ్ట్ వేర్ ను గూగుల్ చూసుకుంటుండగా, హార్డ్ వేర్ ను జియో పరిశీలిస్తున్నది. వాస్తవంగా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆలస్యమైంది. ఎన్ని మోడల్స్ రిలీజు చేస్తారనేది స్పష్టమైన సమాచారం లేనప్పటికీ దీనిపై ఈ నెలాఖరులో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.