FbTelugu

జానా వారిని నమ్మడం లేదా..?

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాజకీయ భీష్ముడు జానారెడ్డి బరిలోకి దిగారు. ఆయన అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఆయనను తట్టుకునే వ్యక్తికోసం ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీలు చాలాకాలం మల్లగుల్లాలు పడ్డాయి. అనేక సర్వేలు కూడా చేయించాయి.

చివరకు నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు (సోమవారం) తమ అభ్యర్థులను ప్రకటించాయి. సాధారణంగా ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతానికి ఆయా పార్టీల రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారానికి వస్తుంటారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా, బూత్‌ల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకోవడం సహజమే. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వమంతా తమ శక్తియుక్తులను ప్రయోగించింది. కానీ, అక్కడ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సాగర్‌ ఎన్నికల్లో కూడా పీసీసీ నేతలంతా అక్కడకు రావాలన్న ప్లాన్‌లో ఉన్నారు. అయితే, వారంతా అక్కడ ఇన్‌చార్జిలుగా పని చేస్తే వచ్చే లాభంకంటే నష్టమే ఎక్కువన్న భావనలో జానారెడ్డి ఉన్నారట. అందుకే వారెవరూ ఇన్‌చార్జిలుగా ఉండవద్దని చెప్పారట. మొత్తం ఎన్నికల క్యాంపెయన్‌ అంతా తానూ, తన కొడుకు రఘువీర్‌లే చూసుకుంటారట. పార్టీ నాయకులు కేవలం ప్రచారానికి వస్తే సరిపోతుందని జానా ఆంక్షలు పెట్టారన్న చర్చ జోరుగా సాగుతోంది.

వాస్తవానికి ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ పోటీకి దిగినా పరాజయం తప్పడం లేదు. ఈ తరుణంలో సాగర్‌ ఉప ఎన్నికలో గెలిచి తమ విజయానికి బాట వేయాలని ఉవ్విళ్లూరుతోంది. సాగర్‌ నియోజకవర్గం మొదటి నుంచీ జానారెడ్డికి పట్టున్న ప్రాంతం. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఓటర్లు ఆయన వెనుక ఎక్కువగా నడిచారు. గత ఎన్నికల్లో కూడా జానారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా విజయం సాధిస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు. వాస్తవానికి సాగర్‌లో జానారెడ్డిని కాదని కాంగ్రెస్‌ పార్టీ చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి జానా వ్యూహాలను తనే రచించుకుంటున్నారట. పైగా కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. ఎవరు ఎవరికి కోవర్టుగా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్న అనుమానం జానాలో కూడా కలిగిందని.. అందుకే నాయకులను నమ్మకుండా తను. తన కొడుకు ఇద్దరే ఈ ఎన్నికలను డీల్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. మరి వీరి ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.