FbTelugu

టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీపై జగన్ ఒత్తిడి: జేసీ

అనంతపురం: టీటీడీకి చెందిన ఆస్తులను విక్రయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తన బాబాయి అయిన టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పై ఒత్తిడి తెచ్చారని మాజీ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

జగన్ రాముడి లాంటి వాడో, రావణాసురుడి లాంటి రాక్షసుడో ప్రజలే తేల్చుకోవాలని  ఆయన అన్నారు. జగన్ నియంతృత్వ ధోరణి, మొండి పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు, తాను చెప్పిందే నడవాలి అనే నైజాన్ని జగన్ ఇకనైనా వదులుకోవాలని జేసీ హితవు పలికారు.

రాజ్యాంగ వ్యవస్థల జోలికి వెళ్తే ఇలాంటి వ్యతిరేక తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని ఆయన అన్నారు. అయినా జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన  హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ లాంటి సీఎం ఏపీకి మళ్లీ దొరకడని, భవిష్యత్తులో కూడా దొరకబోరని ఆయన అన్నారు. ఆయన పాలనకు నూటికి అదనంగా పది మార్కులు వేస్తానని జేసీ.దివాకర్ రెడ్డి  ఎద్దేవా చేశారు.

You might also like