FbTelugu

జ‌గ‌న్ దారికి తెచ్చుకుంటున్నారా..

వినకుంటే హెచ్చ‌రిస్తున్నారా!

జ‌గ‌న్ గెలిచి ఓడాడంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మ‌చ్చ‌లేని పాల‌న‌తో మ‌రో ప‌దేళ్ల‌పాటు జ‌గ‌న్ సీఎం గా ఉంటారంటున్నారు వైసీపీ కండువా క‌ప్పుకున్న నేత‌లు.

నిజ‌మే… క‌మ్మ కుల వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు జ‌గ‌న్ గెలిచాడు. టీడీపీకు బ‌ల‌మైన బీసీలు కూడా క‌ల‌సిరావ‌టం.. ప‌వ‌న్‌ను పక్క‌న‌బెట్టి కాపులు కూడా వైఎస్ వార‌సుడికి జై కొట్ట‌డంతో జ‌గ‌న్ 151 సీట్లు మ‌రింత తేలికైంది. ప్ర‌శాంత్ ‌కిషోర్ చేసింది కూడా ఇదేన‌ట‌.

ఏపీలోని కుల రాజ‌కీయాల‌ను బాగా ఆక‌ళింపు చేసుకున్న పీకే.. బిహార్ ఫార్ములా…. ప‌శ్చిమ‌బంగ ఎమోష‌న్ రెండింటినీ ఏపీలో ప్ర‌యోగించి స‌క్సెస్ అయ్యాడు. ఇదంతా ఏడాది క్రితం మాట‌. మ‌రి 12 నెల‌ల వ్యవ‌ధిలో జ‌గ‌న్ కూడా రాజ‌కీయ ప్ర‌తీకారం చాలా చాక‌చ‌క్యంగా తీర్చుకోసాగాడు. నొప్పి లేకుండానే దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వంటి క‌ర‌డుగ‌ట్టిన టీడీపీ నేత‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్టారు. గొప్ప‌నేత‌గా ముద్ర‌ప‌డిన వైఎస్‌, చంద్ర‌బాబు వంటి వారి మాట కూడా లెక్క‌చేయ‌ని చింత‌మ‌నేని మ‌రో నాలుగేళ్ల‌పాటు బ‌య‌ట‌కు రానంటూ తెగేసి చెప్పేంత‌గా వ‌ణికేలా చేశాడు జ‌గ‌న్‌. ప‌ల్నాట 20 వాహ‌నాల‌తో సీఎంను మించి హ‌డావుడి చేసిన మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ మాఫియా బాంబును సీబీఐతో పేల్పించే ప్ర‌య‌త్నం ముమ్మ‌రంగా సాగుతుంది.

ఉత్త‌రాంధ్ర‌లో అచ్చెన్నాయుడు ఏనాడో సైలెంట్ అయ్యాడు. విశాఖ‌లో గ‌ట్టిగా మాట్లాడే గంటా శ్రీనివాసరావు మౌనం దాల్చాడు. నెల్లూరులో నారాయ‌ణ మ‌ళ్లీ బ‌డి బాట ప‌ట్టాడు. బెజ‌వాడ‌లో దేవినేని ఉమా, బుద్దా వెంక‌న్న‌, బోండా ఉమా, కేశినేని నాని వంటి వాళ్లు కూడా ట్వీట్ల‌తో స‌రిపెట్టుకుంటున్నారు. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకునేందుకు జ‌గ‌న్ దారి చూప‌టం.. వైసీపీను కాస్త ఇరుకున పెడుతున్నా టీడీపీను మాన‌సికంగా, ఆర్ధికంగా దెబ్బ‌తీసేందుకు అదే చ‌ట్టం ఉప‌క‌రిస్తుంద‌ని స‌రిపెట్టుకుంటున్నారు.

ఏమైనా ఫైర్‌బ్రాండ్స్ ఇప్పుడు కేవ‌లం ఫైర్‌లెస్ బ్రాండ్‌లుగా మారాయంటూ వైసీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఎమోష‌న్‌గా గ‌ట్టి నేత‌ల‌ను దెబ్బ‌తీస్తూ.. వైసీపీలోకి వ‌చ్చే మాజీ నేత‌ల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. రాజ‌కీయంగా కూడా కొన్ని పోతిరెడ్డిపాడు, డాక్ట‌ర్ సుధాక‌ర్ రావు‌, ఎల్జీ పాలిమ‌ర్ వంటి అంశాల‌ను తెలివిగా టీడీపీ త‌ప్పిదాల కింద చూప‌టంతో వైసీపీ స‌ర్కారు విజ‌యం సాధించింది. అయితే.. ప‌ల్లెల్లో వైసీపీ ప‌ట్ల పెరుగుతున్న అస‌హ‌నం, వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టి స‌రిదిద్దుకోలేక‌పోతే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న కూడా వైసీపీ సీనియ‌ర్ల‌లో నెల‌కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.