అమరావతి: అసెంబ్లీలో మీడియాను అనుమతించడకపోవడం సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
తన పిచ్చి తుగ్లక్ పాలన బయటపడుతుందనే అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడం లేదని ఆయన అన్నారు. కోవిడ్ ను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి తన తుగ్లక్ పాలనను దాచాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాఠశాలలు, మద్యం షాపులకు అడ్డురాని కరోనా నిబంధనలు అసెంబ్లీలో మీడియా పాయింట్ కు అడ్డు వస్తున్నాయా? అని లేవనెత్తారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు భయం? నీ బండారం బయటపడుతుందనా? ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడుతూ ఉన్నారనా? వైసీపీ 18 నెలల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర. మీడియాను చూసి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? అని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జీఓ 2430 ఇచ్చి మీడియా హక్కులను హరించారు. కోవిడ్ లేని సమయంలో కూడా అసెంబ్లీలోకి మీడియాను అనుమతించలేదన్న విషయం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మరిచిపోయారా?. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే అసెంబ్లీలోలి మీడియా పాయింట్ ను అనుమతించాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.