FbTelugu

జగన్ అబద్దాలతో అధికారం: కన్నా

విజయవాడ: అనుభవ రాహిత్యం, అసమర్ధత, అవినీతి, అవగాహన లేకపోవడం, ఆత్రం,  పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగ్.. ఇదే జగన్ ఏడాది పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దెప్పి పొడిచారు.

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు మధ్య పోటీ జరిగిందని అన్నారు. విభజన తరువాత అనుభవం ఉన్న వ్యక్తి గా చంద్రబాబు కు ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు తన అనుభవంతో ఎలా దోచుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చి ఎలా పక్కదారి పట్టించాలి అనే ఆలోచన చేశారన్నారు. 2014-19 వరకు కేంద్రం నిధులను సొంత పధకాలుగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

2019లో ప్రజలు నమ్మి జగన్ కు అవకాశం ఇస్తే… ఆయన విశ్వరూపం చూపిస్తున్నారన్నారు. జగన్ మాటలు వింటుంటే… ప్రజలు తమను తామే మోసం చేసుకునే విధంగా ఉన్నాయని కన్నా అన్నారు.

పోలవరం పనుల్లో అవినీతి జరిగింది వాస్తవం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి బయటకు తీస్తానన్నాడు కాని ఆ పని చేయడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పులను చూపుతూ.. నాకు అవకాశం ఇవ్వాలని జగన్ ప్రజలను కోరాడన్నారు.

2021కల్లా పూర్తి చేస్తానన్న జగన్.. న్యాయపరమైన చిక్కులు కూడా పరిష్కారం చేయలేని అసమర్థత కనిపిస్తుందని కన్నా అన్నారు. ఏపీ రాజధాని చుట్టూ రెండు పార్టీ లు రాజకీయం చేశాయని, జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో కొత్త రాజకీయం చేశాడని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నం భూముల వ్యవహారంలో సీబీసీఐడీ వేసినా… అవినీతి నిరూపించక పోవడం అసమర్థత కాదా అని ఆయన నిలదీశారు. రాయలసీమ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను కూడా పట్టించు కోవడం విచారకరమన్నారు. ప్రాజెక్టు ల విషయంలో ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఇసుక, మైనింగ్ దోపిడీ జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం మారినా… దోపిడీ మాత్రం దర్జాగా కొనసాగుతోందన్నారు.

ఈ ప్రభుత్వం పై నమ్మకం లేదు అనడానికి హైకోర్టులో 65 తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు కు కూడా కులాలు, మతాలను అంటగట్టేలా మీ ఎమ్మెల్యే లు, నాయకులు బరితెగించారని కన్నా ఆరోపించారు. వీటన్నింటికి బాద్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తిరుమల పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేశావని, ఇప్పటికీ ఆ పింక్ డైమండ్ ఏమైందో కనుక్కోలేకపోయారన్నారు. ఏపీ ప్రజల డేటా చౌర్యం అన్న జగన్…. వాటి పై చర్యల ఉసే లేదన్నారు. డేటా చౌర్యం పై  ఇప్పుడు నేను వ్యక్తిగతంగ ఫిర్యాదు చేశాను, అతీగతీ లేదన్నారు.

నా మీద హత్యాప్రయత్నం చేశారని అన్న జగన్.. ఆ కేసు ఏమైందో చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే… నువ్వే ఆ ఘటన  చేయించుకుని.. డ్రామా ఆడావనే అనుమానం కలుగుతుందన్నారు. నేను 70కి పైగా ఉత్తరాలు రాస్తే… దున్నపోతు మీద వర్షం పడిన చందంగా స్పందించలేదన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కు కూడా కులం అంటగట్టి.. ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తారా? ఇదేం పాలన అని దుయ్యబట్టారు. 151సీట్లు నీకిస్తే.. ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. జగన్ రెడ్డి గొప్ప సీఎం కాదు… విఫలమైన సీఎం అని ఆరోపించారు. ఈ ఏడాది పాలన మొత్తం నేను చెప్పిన ఎనిమిది క్యాప్షన్స్ ప్రకారమే నడిచిందని, ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

You might also like