FbTelugu

జగన్‌ నిర్ణయం ఏమిటో..?

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తప్పించిన ప్రభుత్వం ఆ తర్వాత గవర్నర్‌ ద్వారా మరో కొత్త అధికారిగా కనకరాజును నియమించింది.

చివరకు నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో అది అనేక మలుపులు తిరిగి చివరకు బంతిని గవర్నర్‌ కోర్టులో ఉంచింది హైకోర్టు. దీంతో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం నిమ్మగడ్డకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు. కానీ, ఆ ఆదేశాలను జగన్‌ సర్కారు పాటిస్తుందా.. లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిమ్మగడ్డ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించడంతో పాటు అతడికి పదవిని అప్పగించే ప్రసక్తే లేదన్నట్టుగా వైసీపీ సర్కారు గుర్రుగా ఉంది. నిమ్మగడ్డ తొలగింపును హైకోర్టు తప్పుబట్టింది.

వెంటనే అతడికి పదవిని అప్పగించాలని ఏపీ సర్కారును ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ, నిమ్మగడ్డకు పదవి ఇవ్వడం ఇష్టంలేని జగన్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, సుప్రీంకోర్టు కూడా దీనిని అంగీకరించలేదు. చివరకు సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను జగన్‌ అమలు చేస్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డకు హైకోర్టు సలహా ఇచ్చిన వెంటనే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని జగన్‌ సర్కారు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ జగన్‌ సర్కారు గవర్నర్‌ నిర్ణయాన్ని కూడా అమలు చేయకుంటే రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్‌ అంతదాకా తెచ్చుకుంటారా..? లేక, తను పట్టిన పట్టు సడలిస్తారా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

You might also like