FbTelugu

కమలం గూట్లోకి ఈటల రాజేందర్

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ చేరికకు బిజెపి అధిష్టానం ఓకె చెప్పింది. ఈటల రాజేందర్ చేరికపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా రాష్ట్ర నాయకులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
జాతీయ, రాష్ట్ర నాయకులతో నడ్డా చర్చించిన తరువాత ఈటల రాజేందర్ చేరికకు మార్గం సుగమం చేశారు. ఎప్పుడు చేరేది తేదీ ఖరారు అయిన తరువాత బిజెపి ముఖ్య నేతల సమక్షంలో ఈటల కండువా కప్పుకుని, పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా చేరనున్నారు. కొద్ది రోజుల నుంచి ఈటల రాజేందర్ బిజెపి కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

బుధవారం నాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తురుణ్ చుగ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో చర్చలు జరిపారు. పెద్దపల్లి మాజీ ఎంపి జి.వివేకానంద్ తో ఫోన్ లో సంప్రదింపులు జరిపిన తరువాత చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన తరువాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బిజెపికి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఒకరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాగా మరొకరు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల చేరికతో బలం మూడుకు పెరగనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.