FbTelugu

టిఆర్ఎస్ కు ఈటల రాజేందర్ రాం రాం

హైదరాబాద్: మంత్రివర్గం నుంచి ఇటీవలే బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇవాళ రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, ఒక అనామకుడు మంత్రి మీద ఫిర్యాదు చేస్తే కనీసం నన్ను విచారించకుండా రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారని సిఎం కెసిఆర్ పై విరుచుకుపడ్డారు. కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కాని ఆత్మగౌరవం దక్కకపోతే ఊరుకోరని ఆయన హెచ్చరించారు. నేను ఏనాడు ఓడిపోలేదని, కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపిగా చిత్తు చిత్తుగా ఓడిపోయిందన్నారు. కెసిఆర్ కు, తనకు మధ్య ఐదేళ్ల నుంచి పొసగడం లేదని, ఇప్పుడు వచ్చిన సమస్య కాదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు నిత్యం అవమానాలు భరిస్తూ తప్పని పరిస్థితుల్లో కొనసాగుతున్నారని ఈటల వివరించారు.

ఇజ్జత్ తక్కువ బతుకు వద్దని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు చెప్పారన్నారు. అందుకే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. 19 సంవత్సరాలుగా టిఆర్ఎస్ లో ఉన్నాను, ఎన్నో అవమానాలు భరించానని, తెలంగాణ కోసం మరో కారణం లేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని, ప్రజల నిర్ణయం మేరకు ముందుకు వెళ్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.