FbTelugu

అసైన్డు భూములపై విచారణ చేయాలి: ఈటల డిమాండ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అన్ని అసైన్డు భూములపై విచారణ జరిపించాలని, నేను అసైన్డు  భూములు తీసుకున్నానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

నేను అవినీతి చేస్తే ఆరు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి నన్ను ప్రజలు గెలిపించరని,  సాటి మనిషికి ఆపద వస్తే ముందుండేవాడినని ఆయన సమర్థించుకున్నారు. ఈటెల రాజేందర్ చరిత్ర పాతికేళ్ల చరిత్ర అని, అయినా నా పదవి గడ్డిపోచతో సమానం అని నేను అవమానకరంగా మాట్లాడను గాక మాట్లాడను అని అన్నారు. 2016లో నా భార్య జమునా పేరుతో హెచరీస్ కోసం రూ.6లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశాను. హెచరీస్ కు భూమి విస్తరణ అవసరం కాగా చుట్టూ అసైన్డు భూములు ఉన్నాయి.

విషయం ముఖ్యమంత్రి, సిఎం ఆఫీసు అధికారులకు కూడా వివరించాను. ప్రభుత్వం ఆధ్వర్యంలో భూముల సేకరణ ఆలస్యం అవుతుందని తెలుసుకుని ఆ ఆలోచన విరమించుకున్నామన్నారు. అసైన్డు భూముల యజమానులే తమ బిడ్డల పెళ్లి కోసం డబ్బులు కావాలి, తమ భూములు కొనుక్కోవాలని కోరారు. కానీ అది చట్ట విరుద్ధమని చెప్పి తిప్పి పంపాను. ఇప్పటికీ ఆ భూములు వారి పేర్ల మీదనే ఉన్నాయన్నారు. నా ఆస్తులు కరీం నగర్ జిల్లా ప్రజలకు తెలుసునని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి నాపై కక్ష్యతో రింగ్ రోడ్డు తప్పుడు అలైన్ మెంట్ తో నా భూమిని నాకు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. అయినా నా ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు, నా ఇంట్లో నిత్యాన్న వితరణ ఉంటుందన్నారు. నా ఆస్తులు నా చెమట చుక్కలతో సంపాదించానని, నా ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని నేనే డిమాండ్ చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. నేను ముదిరాజ్, నా భార్య రెడ్డి.. నా కులం మీద కూడా వివాదం రేపారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. నా సంతానం రెడ్డి కులం వాళ్లను చేసుకున్నారని, ఇందులో తప్పేముందో చెప్పాలన్నారు. ఆత్మ గౌరవం కంటే పదవి గొప్పది కాదని ఈటల స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.