FbTelugu

కేంద్రంపై భగ్గుమన్న ఈటల రాజేందర్

హైదరాబాద్: ఇంజక్షన్ లు, వాక్సిన్ లు, ఆక్సిజన్ కేటాయింపు లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ లో ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. వాక్సిన్ ధరలో తేడాలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం సంకుచిత ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల వారు శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇవాళ సచివాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీ, కర్ణాటక లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సిఎం ఆదేశించారని అన్నారు. ఆ ప్రకారమే 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్ లకు ఆర్డర్ పెట్టాము. మన దగ్గరే ఇవి తయారు అవుతుండడంతో మనకు ఎక్కువ డోసులు వస్తాయని ఆశించాము. కానీ కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తమ కంట్రోల్ లో కి తీసుకొని మనకు మొండి చెయ్యి చూపించిందని ఈటల రాజేందర్ అన్నారు.

4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కోసం ఆర్డర్ పెడితే గత 10 రోజుల్లో కేంద్రం ఇచ్చింది 21,551 మాత్రమేనన్నారు. అదే గుజరాత్ కి 1.63 లక్షలు, మహారాష్ట్ర కి 2 లక్షలు, ఢిల్లీ కి 61 వేలు, మధ్యప్రదేశ్ కి 92 వేల ఇంజెక్షన్లు ఇచ్చారు. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష పట్ల  తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాల్సింది పోయి ఇలా చేయడం బాధ కలిగిస్తుందన్నారు. ఆక్సిజన్ మన దగ్గర తయారు కాదని కర్ణాటకలోని బళ్ళారి, విశాఖ,  ఇతర రాష్ట్రాల నుండి రావాలన్నారు. దగ్గర ఉన్న ప్లాంట్ నుండి కాకుండా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా నుండి పంపిస్తామంటున్నారు. చెన్నై నుండి 20 టన్నులు, పెరంబుదూరు లో 35 టన్నులు కేటాయించారు కానీ తమిళనాడు ప్రభుత్వం ససేమిరా అనడం రాలేదన్నారు. అందుకే విశాఖ నుండి కేటాయించాలని కోరామని, కేటాయింపులు మార్చకపోతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని మంత్రి ఈటల అన్నారు.

సిలిండర్ల విషయంలో కొంత కొరత ఉంది, కొంతమంది కావాలని కొరత సృష్టిస్తున్నారని మా దృష్టికి వచ్చింది, అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపవద్దు అని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మా దగ్గర తయారయిన ఇంజెక్షన్లు, వాక్సిన్ లు మేమే వాడుకుంటాం అని చెప్ప వచ్చు .. కానీ మేము అంత సంకుచితంగా మేము లేమన్నారు. కరోనా నియంత్రణ కు వాక్సిన్ ద్వారానే అని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తి పెంచాల్సింది. కానీ కేంద్రం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరించిందని మండిపడ్డారు. మనం ఇచ్చిన సలహాలు సూచనలు పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. ముందే స్పందించి ఉంటే ఈ రోజు ఈ పరిస్తితి వచ్చేది కాదన్నారు. మంత్రి కెటిఆర్, సిఎం కెసిఆర్ మన దగ్గర ఉన్న అన్ని కంపెనీలతో వాక్సిన్ ప్రొడక్షన్ పెంచమని కోరారని, కేంద్రం నియంత్రించడం మూలంగా పెంచలేదని ఈటల రాజేందర్ అన్నారు.

కొంత మంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు కట్టలేని వారిని చివరి దశలో సికింద్రాబాద్ గాంధీ కి పంపిస్తున్నారు.  ఇలాంటి సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునే మాదిరి  వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు. చివరి నిమిషంలో గాంధీ కి పంపించడం వల్ల అక్కడ వెంటిలేటర్ బెడ్ కి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్రానికి రూ.150కు, రాష్ట్రాలకు రూ.400 కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 కు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. దేశ ప్రజలందరికీ కాపాడే బాధ్యత కేంద్రం మీద ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. రేట్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా?  ఈ సమయంలో ఇలా వ్యవహరించవచ్చా? అని మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.